కోవై కారు బాంబు కేసు
● ఐదుగురిపై ఎన్‌ఐఏ చార్జ్‌షీట్ దాఖలు ● నకిలీ కరోనా టీకాలు విక్రయించి డబ్బు సమకూర్చినట్లు వెల్లడి
సేలం: కోవైలో 2022లో కారు బాంబు ఘటనకు సంబంధించి అరెస్టయిన వ్యక్తి సహా ఐదుగురిపై ఎన్‌ఐఏ అధికారులు చార్జ్‌షీట్ దాఖలు చేశారు. 2022 అక్టోబర్ 23న కోయంబత్తూరులోని ఉక్కడం కోటఈశ్వరన్ ఆలయం ముందు కారు బాంబు పేలింది. బాంబు దాడికి ప్రధాన సూత్రధారి అయిన జమేషా ముబిన్ ఈ సంఘటనలో మరణించాడు. ఈ సంఘటన తీవ్ర సంచలనం సృష్టించడంతో, ఈ కేసు ఎన్‌ఐఏ దర్యాప్తులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో, ఈ కేసుకు సంబంధించి ఎన్‌ఐఏ గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో, ఐదుగురిపై చార్జ్‌షీట్ దాఖలు చేసినట్లు పేర్కొంది. షేక్ హిదయతుల్లా, ఉమర్ ఫరూఖ్, ఫవాజ్ రెహ్మాన్, షరన్, అబూహనీఫాలపై ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చినట్లు కూడా ఎన్‌ఐఏ అభియోగాలు మోపింది. వారు కార్ బాంబు దాడులకు సంబంధించిన సంఘటనలలో కూడా పాల్గొన్నారని ఆరోపణలు ఉన్నాయి. వీరితో సహా, కారు బాంబు దాడి కేసులో ఇప్పటి వరకు 17 మందిపై చార్జ్‌షీట్ దాఖలు చేశారు. వారిలో షేక్ హిదయతుల్లా, ఉమర్ ఫరూక్ నకిలీ కరోనా టీకా సర్టిఫికెట్లు తయారు చేసి, వారి నుంచి పొందిన డబ్బుతో కారు బాంబు దాడి ఘటనకు అవసరమైన పేలుడు పదార్థాలు, అవసరమైన పరికరాలను కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇంకా, ఫవాజ్ రెహమాన్, శరణ్ నకిలీ సర్టిఫికెట్ తయారు చేయడంలో సాయం చేశారు. దీనికి అవసరమైన డబ్బును అబుహనీఫా అందించాడని జాతీయ నిఘా సంస్థ పేర్కొంది. ఇదిలాఉండగా అంతకుముందు ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు. వారిలో మహ్మద్ తల్కా, మహ్మద్ అజారుద్దీన్, మహ్మద్ రియాజ్, ఫిరోజ్ ఇస్మాయిల్, మహ్మద్ నవాజ్ ఇస్మాయిల్, అప్సర్ ఖాన్ ఉన్నారు. ఈ సమయంలోనే కేసును జాతీయ దర్యాప్తు సంస్థకు బదిలీ చేశారు. ఎన్‌ఐఏ అధికారులు కోయంబత్తూరులో మకాం వేసి, ముమ్మరంగా దర్యాప్తు జరిపి, ఉమర్ ఫరూఖ్, ఫిరోజ్ ఖాన్, మహ్మద్ తౌఫిక్, మహ్మద్ ఇద్రిస్, మహ్మద్ అజారుద్దీన్, నజీర్ సహా ఎనిమిది మందిని అరెస్టు చేశారు. కాగా ఇప్పటి వరకు కారు బాంబు కేసులో మొత్తం 14 మందిని అరెస్టు చేశారు. చైన్నెలోని పూనమల్లిలోని జాతీయ దర్యాప్తు సంస్థ ప్రత్యేక కోర్టులో వారిపై ఎన్‌ఐఏ అధికారులు నాలుగు చార్జిషీట్లు దాఖలు చేయడం గమనార్హం.


