రోడ్డు ప్రమాదంలో పారిశుద్ధ్య కార్మికుడి దుర్మరణం
పళ్లిపట్టు: రోడ్డు ప్రమాదంలో పారిశుద్ధ్య కార్మికుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. తిరుత్తణి సమీపం సింగరాజుపురం గ్రామానికి చెందిన చంద్రమౌళి(45) పంచాయతీలో తాత్కాలిక పారిశుద్ధ్య కార్మికుడిగా విధులు నిర్వహించేవారు. బుధవారం పొదటూరుపే సమీపంలో బంధువుల ఇంటి అశుభ కార్యక్రమంలో పాల్గొని ఇంటికి బైకులో పయనించాడు. పొదటూరుపేట ప్రభుత్వ బస్సు డిపో వద్ద వెళ్తుండగా బైకు అదుపు తప్పి కింద పడడంతో తలకు తీవ్రమైన గాయాలయ్యాయి. అతన్ని అక్కడున్న వారు కాపాడి 108 అంబులన్స్ సాయంతో తిరుత్తణి ప్రభుత్వాసుపత్రిలో చేర్పించి చికిత్స పొందుతూ వచ్చాడు. ఈక్రమంలో శుక్రవారం చికిత్స ఫలించక చంద్రమౌళి మృతి చెందాడు. పొదటూరుపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


