బోనులో చిక్కిన ఎలుగుబంటి
సేలం: మణిముత్తారు సమీపంలో గ్రామాల్లోకి హల్‌చల్ చేస్తూ వచ్చిన ఎలుగు బంటి పది రోజుల తర్వాత బోనులో పట్టుబడింది. నెల్‌లై జిల్లా పశ్చిమ కనుమల ప్రాంతంలో జింకలు, ఎలుగుబంట్లు, ఏనుగులు, చిరుత పులులు వంటి అనేక అడవి జంతువులు జీవిస్తున్నాయి. ఇవి అప్పుడప్పుడు ఆహారం, నీటి కోసం అడవి సమీపంలోని గ్రామాల్లోకి చొరబడి ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఈ క్రమంలో గత 19వ తేది రాత్రి అంబై సమీపంలో ఉన్న మనిముత్తారు ప్రాంతానికి వెళ్లే రోడ్డు సమీపంలో ఉన్న పాప్పాన్‌కుళం గ్రామంలో ఒక ఎలుగు బంటి చొరబడింది. ఇక్కడి గోల్డన్ నగర్, పొన్‌మా నగర్ ప్రాంతాలలో ఆ ఎలుగు బంటి సంచరించింది. ఆ తర్వాత నెసవాలర్ కాలనీ పంట పొలాల సమీపంలో ఉన్న అగ్ని సాస్తా ఆలయం ప్రాంతంలో ఎలుగు బంటి సంచరిస్తున్నట్టు సీసీటీవీ వీడియో దృశ్యాల ద్వారా తెలిసింది. ఆ దృశ్యాలు సామాజిక మాధ్యమాలలో వైరల్ అయ్యాయి. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న ప్రజలు భయాందోళనతో ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఉన్నారు.
బోను ఏర్పాటు
సమాచారం అందుకున్న అంబై అటవీ రేంజ్ డిప్యూటీ కమిషనర్ ఇళయరాజా ఉత్తర్వుల మేరకు అటవీ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని ఎలుగుబంటిను పట్టుకోవడానికి బోను ఏర్పాటు చేశారు. ఈ స్థితిలో గత 10 రోజులుగా ఆ ఎలుగుబంటి బోను చుట్టుపక్కల సంచరిస్తున్నప్పటికీ పట్టుబడకుండా ఉంది. ఎట్టకేలకు ఎలుగుబంటి శనివారం రాత్రి బోనులో పట్టుబడింది. అటవీ శాఖ అధికారులు ఆదివారం ఉదయం బోనులో పట్టుబడిన ఎలుగుబంటిని సురక్షితంగా దట్టమైన అడవి ప్రాంతంలో వదలడానికి చర్యలు చేపట్టారు. గత రెండు వారాలకు పైగా సంచరిస్తున్న ఎలుగు బంటి పట్టుబడడంతో ఆ ప్రాంతవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


