బీజేపీలో చేరిన తమిళనాడు కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయధరణి | Sakshi
Sakshi News home page

బీజేపీలో చేరిన తమిళనాడు కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయధరణి

Published Sun, Feb 25 2024 1:32 AM

- - Sakshi

సాక్షి, చైన్నె: విలవన్‌ కోడ్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే విజయధరణి బీజేపీలోకి చేరారు. శనివారం ఢిల్లీలో కేంద్ర సహాయ మంత్రి ఎల్‌. మురుగన్‌, రాష్ట్ర పార్టీ వ్యవహారాల కో– ఇన్‌చార్జ్‌ పొంగులేటి సుధాకర్‌రెడ్డి సమక్షంలో ఆమె బీజేపీ కండువా కప్పుకున్నారు. కన్యాకుమారి జిల్లా విలవన్‌ కోడ్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2011, 2016, 2021లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా విజయధరణి గెలిచిన విషయం తెలిసిందే. మూడుసార్లు ఆమె అసెంబ్లీకి ఎన్నికై నా కాంగ్రెస్‌లో సరైన గుర్తింపు దక్కలేదు. పార్టీ పరంగా పదవులు తనకు దక్కకుండా సీనియర్లు అడ్డుకుంటున్నట్లు పలుమార్లు ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

పార్టీలో తగిన గుర్తింపు లేని కారణంగా బీజేపీలో చేరాలని నిర్ణయించారు. గతవారం రోజులుగా ఆమె ఢిల్లీలోనే తిష్ట వేశారు. ఈ పరిస్థితులలో శనివారం బీజేపీ కార్యాలయానికి వెళ్లారు. బీజేపీ సభ్యత్వం స్వీకరించారు. తనకు కాంగ్రెస్‌లో గుర్తింపు లేదని, ప్రజలకు సేవ చేయలేని పరిస్థితి ఉండేదని ఈసందర్భంగా విజయ ధరణి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో తన సేవలను విస్తృతం చేస్తానని, బీజేపీ బలోపేతంకు తన వంతుగాకృషి చేస్తానన్నారు. త్వరలో మరికొందరు ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో చేరేందుకు అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా, ఆమె బీజేపీలో చేరిన మరుక్షణం పార్టీ నుంచి తొలగిస్తూ ఏఐసీసీ నిర్ణయం తీసుకుంది. అలాగే పార్టీ ఫిరాయింపు చట్టం కింద ఆమైపె అనర్హత వేటుకు తమిళనాడు అసెంబ్లీ స్పీకర్‌ అప్పావుకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. కాగా ఎమ్మెల్యే పదవికి అనర్హత వేటు పడ్డ పక్షంలో కన్యాకుమారి లోక్‌సభ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీకి విజయధరణి సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement