
తిరుచెందూరు సుబ్రమణ్యస్వామి ఆలయం
● నేడు సూరసంహారం ● పోటెత్తుతున్న భక్త జనసందోహం ● ఆలయంలో విశిష్ట పూజలు
సాక్షి, చైన్నె: ఆరుప్పడై వీడులలో ప్రసిద్ధి చెందిన తిరుచెందూరు వైపు భక్త జనసందోహం పోటెత్తుతున్నారు. శనివారం సముద్రతీరంలో సూరసంహార ఘట్టం అద్వితీయంగా జరగనుంది. ఈ దృశ్యాన్ని కనులారా వీక్షించేందుకు లక్షల్లో భక్తులు తరలి వస్తుండడంతో తిరుచెందూరును నిఘా నీడలోకి పోలీసులు తీసుకొచ్చారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
సుబ్రమణ్యస్వామికి రాష్ట్రంలోని ఆరుపడై వీడులలో తిరుచెందూరు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ జయంతినాదర్‌గా కొలువై ఉన్న మురుగన్‌ను దర్శించుకునేందుకు నిత్యం భక్తులు తరలి వస్తుంటారు. సముద్రతీరంలో కొలువై ఉన్న ఈ ఆలయంలో ఈనెల 13వ తేదీ నుంచి యాగశాల పూజలతో స్కంధషష్టి ఉత్సవాలు కనులపండువగా జరుగుతున్నాయి. ఐదు రోజులుగా నిత్య అభిషేకాది పూజలు, అలంకరణలు, వాహనసేవలతో జరుగుతున్న ఈ ఉత్సవాలను తిలకించేందుకు భక్తుల వేలాదిగా తరలివచ్చారు. శుక్రవారం వేకువజామున స్వామివారి విశ్వరూప దర్శనం, దీపారాధన, ఉదయ మార్తాండ అభిషేకం జరిగింది. స్వామి జయంతి నాదర్, వళ్లి, దైవానై సమేతంగా బంగారు చప్పరం వాహనంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. ఈ ఉత్సవాలలోనే అత్యంత ముఖ్య ఘట్టం సముద్రతీరంలో జరిగే సూరసంహారం వేడుక. ఈ అద్వితీయ ఘట్టాన్ని తిలకించేందుకు రాష్ట్రం నుంచే కాదు, పొరుగు రాష్ట్రాలు, విదేశాల నుంచి భక్తులు తరలిరావడం జరుగుతోంది. లక్షలాది భక్తుల సమక్షంలో జరిగే ఈ ఘట్టాన్ని దృష్టిలో ఉంచుకుని తిరుచెందూరును పోలీసులు నిఘా నీడలోకి తెచ్చారు.
కట్టుదిట్టంగా భద్రత..
తిరునల్వేలి, తూత్తుకుడి, రామనాథపురం జిల్లాలకు చెందిన పోలీసులు వేలాది మందిని తిరుచెందూరులో విధులకు నియమించారు. తిరుచెందూరు వైపు వచ్చే వాహనాలను శుక్రవారం సాయంత్రం నుంచే నగర సరిహద్దులకు పరిమితం చేశారు. నగరంలోకి ఎలాంటి వాహనాలను అనుమతించడం లేదు. భక్తులు సరిహద్దుల నుంచి నడుచుకుంటూ ఆలయం వైపు వెళ్లే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇనుప పైప్‌లతో బారికేడ్లను సముద్రతీరం అంతా రక్షణ కవచంగా ఏర్పాటు చేశారు. భక్తులు ఎవ్వరు సముద్రంలోకి చొచ్చుకు వెళ్లని విధంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా డ్రోన్ల ద్వారా భద్రతను పర్యవేక్షిస్తున్నారు. సూర సంహార వేడుక దృష్ట్యా, టాస్మాక్ మద్యం దుకాణాలను తిరుచెందూరులో మూసి వేయడం గమనార్హం.
సాయంత్రం వేడుక..
ప్రజల్ని వేదించే సూరన్ అనే రాక్షసుడ్ని సంహరించే వేడుకే ఈ అద్వితీయ ఘట్టం. ఈ ఉత్సవం నిమిత్తం శనివారం వేకువజాము నుంచే ఆలయంలో ప్రత్యేక పూజలు , అభిషేకాలు జరుగుతాయి. సాయంత్రం సాగర తీరంలో జరిగే ఈ వేడుకలో ఆ రాక్షసుడు పలు వేషాలను ధరించి సుబ్రమణ్య స్వామి చేతికి చిక్కకుండా మాయలు చేసే ప్రయత్నాలు చేస్తాడు. చివరకు తన దండాయుధంతో రాక్షసుడిని జయంతి నాదర్‌స్వామి సంహరించే ఈ ఘట్టాన్ని తిలకించే సమయంలో హరోహర నామస్మరణ మిన్నంటుతుంది. ఈ ఉత్సవం అనంతరం భక్తులు ఆలయంలో స్వామి వారిని దర్శించుకునేందుకు పోటెత్తడం జరుగుతుంది. ఈ సమయంలో ఎలాంటి తొక్కిసలాట, తోపులాట చోటుచేసుకోకుండా ముందు జాగ్రత్తలతో ఏర్పాట్లు చేశారు. ఇదిలా ఉండగా తిరుచెందూరు ఆలయంలో దర్శనానికి రూ.1000 నగదు తీసుకుని భక్తులను సిబ్బంది అనుమతిస్తున్నారని ఓ వీడియో వైరల్‌గా మారింది. దీనిని పరిశీలించగా మార్ఫింగ్ అని తేలింది. దీంతో ఈ వీడియోను సామాజిక మాధ్యమాలలో విడుదల చేసిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.