
సుప్రీంకోర్టు
● హోం శాఖకు కూడా.. ● విచారణకు రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్
సాక్షి, చైన్నె: గవర్నర్ ఆర్‌ఎన్ రవి కార్యదర్శికి సుప్రీంకోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. అలాగే, హోంశాఖకు కూడా నోటీసులు పంపించారు. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. సీఎం ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్ ఆర్‌ఎన్ రవి మధ్య వివాదం ముదిరిన విషయం తెలిసిందే. అసెంబ్లీ వేదికగా తాము చేసిన తీర్మానాలు, మంత్రి వర్గం ఆమోదించిన కీలక నివేదికలు, ఉత్తర్వులకు గవర్నర్ అనుమతి ఇవ్వడం లేదని రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. 13కు పైగా తీర్మానాలు, పలు నివేదికల సిఫారసులకు ఆయన ఆమోదం తెలపడం లేదని, అన్నింటిని తుంగలో తొక్కినట్టు ఆరోపిస్తూ న్యాయపోరాటానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా గత వారం గవర్నర్ ఆర్‌ఎన్ రవికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ శుక్రవారం విచారణకు వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ తరఫు న్యాయవాదులు తమ వాదనను సుప్రీం కోర్టు బెంచ్ ముందు ఉంచారు. తమిళనాడు ప్రభుత్వం వ్యవహారాలను గవర్నర్ అడ్డుకుంటున్నారని వాదించారు. కీలక అంశాలను స్తంభింప చేస్తున్నారని పేర్కొన్నారు. అసెంబ్లీ ఆమోదించిన తీర్మానాలకు ఎలాంటి సమాధానాలు ఇవ్వకుండా రాజ్‌భవన్‌కే పరిమితం చేసినట్టు వివరించారు. పని నియామకం మొదలు, ప్రభుత్వ వ్యవహారాలకు సంబంధించిన కీలక ముసాయిదాలన్నీ పెండింగ్‌లో ఉండడంతో ఆయా విభాగాల పనులలో జాప్యం తప్పడం లేదని వాదించారు. 2020 సంవత్సరం నుంచే అన్ని ముసాయిదాలను పక్కన పెట్టినట్టు వివరించారు. తమిళనాడు నుంచి కశ్మీర్ వరకు అనేక మంది గవర్నర్ల రూపంలో ప్రభుత్వాలకు సమస్య తప్పడం లేదని కోర్టుకు తెలియజేశారు. ఈ కేసును కీలకంగా పరిగణించాలని, త్వరితగతిన విచారణను పూర్తి చేసి న్యాయం చేకూర్చాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం తదుపరి ఈ కేసును దీపావళి సెలవుల అనంతరం విచారిస్తామని సూచించారు. అలాగే, ఈ కేసులో ప్రతివాదులకు నోటీసులు పంపించేందుకు న్యాయమూర్తులు ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో తమిళనాడు గవర్నర్ కార్యదర్శి, కేంద్ర హోంశాఖను చేర్చారు. తదుపరి విచారణను ఈనెల 24వ తేదీకి వాయిదా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment