తిరువొత్తియూరు: చైన్నె కోయంబేడు బస్టాండ్‌లో గంజాయి కలిగి ఉన్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 3 కిలోల గంజాయి, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కొందరు ఆంధ్రా నుంచి గంజాయి తీసుకొచ్చి కోయంబేడు బస్‌స్టేషన్‌లో విక్రయిస్తున్నట్లు పోలీసులకు రహస్య సమాచారం అందింది. కోయంబేడు డిప్యూటీ కమిషనర్ ఉమయాల్ నేతృత్వంలో ప్రత్యేక బృందం పోలీసులు ఆంధ్రా నుంచి కోయంబేడుకు వచ్చే బస్సుల వద్ద నిఘా ఉంచారు. ఒక బస్సు నుంచి కిందకు దిగిన ఇద్దరు చేతిలో సంచి పట్టుకుని ఉన్నారు. చాలా సమయం వరకు అనుమానాస్పదంగా అక్కడే నిలబడి ఉన్నారు. వారిని పోలీసులు విచారణ చేయగా పొంతనలేని సమాధానం చెప్పారు. వారి సంచిని తనిఖీ చేయగా అందులో 3 కిలోల గంజాయి కనిపించింది. విచారణలో వారిద్దరూ రామనాథపురం జిల్లాకు చెందిన బాలురని(17) తెలిసింది. ఈ నెల 1వ తేదీ రామనాథపురం జిల్లా నుంచి కూలి పనుల కోసం చైన్నెకి వచ్చి అద్దె ఇంటిలో ఉంటున్నట్లు తెలిసింది. వారి వద్ద నుంచి గంజాయి, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరినీ ఎగ్మూర్ కోర్టులో హాజరుపరిచి చైన్నె జువైనల్ హోంకు తరలించారు.