అన్నానగర్: ఎగ్మూర్ కోర్టు కాంప్లెక్స్ వద్ద జరిగిన లాయర్ హత్య కేసులో న్యాయవాది సహా ఇద్దరికి జీవిత ఖైదు విధిస్తూ చైన్నె కోర్టు మంగళవారం తీర్పునిచ్చింది. చైన్నె ఎగ్మూర్ బార్ అసోసియేషన్ ఎన్నికలు గత ఏడాది జరిగాయి. ఎన్నికల ఫలితాలు వెలువడగానే కోర్టు కాంప్లెక్స్‌లో న్యాయవాదులు ఇరువర్గాలుగా విడిపోయి వాగ్వాదానికి దిగారు. రాళ్లదాడికి పాల్పడ్డారు. అదే విధంగా మారణాయుధాలతో దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణలో లాయర్ స్టాలిన్ (38) కత్తిపోట్లతో మృతిచెందాడు. న్యాయవాదులు మైఖేల్, చార్లెస్, రాజేష్, లోకేశ్వరి అలియాస్ ఈశ్వరి సహా 17 మందిపై ఎగ్మూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణ చైన్నెలోని 1వ అదనపు సెషన్స్ కోర్టులో న్యాయమూర్తి లింగేశ్వరన్ సమక్షంలో జరిగింది. విచారణ సమయంలో మైఖేల్, రాజేష్ మరణించారు. దీంతో మిగిలిన 15 మందిపై కేసు కొనసాగింది. మంగళవారం కేసును విచారించిన న్యాయమూర్తి నిందితులు లోకేశ్వరి, చార్లెస్‌లపై అభియోగాలు రుజువు కావడంతో జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పారు. లోకేశ్వరికి రూ.31 వేలు, చార్లెస్‌కు రూ.65వేలు చెల్లించాలని ఆదేశించారు. అభియోగాలు రుజువు కాకపోవడంతో మరో 13 మందిని నిర్ధోషులుగా విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.