వీసీల సమావేశంలో మాట్లాడుతున్న పొన్ముడి
● అభిప్రాయ సేకరణలో మంత్రి ● వీసీలతో పొన్ముడి భేటీ
సాక్షి, చైన్నె: రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల పరిఽధిలోని కళాశాలలో ఒకే రకమైన పాఠ్యాంశాన్ని అమలు చేయడం లక్ష్యంగా ప్రభుత్వం కార్యాచరణపై దృష్టిపెట్టింది. ఇందులోభాగంగా అన్ని వర్సిటీల వీసీలతో శుక్రవారం ఉన్నత విద్యాశాఖ మంత్రి పొన్ముడి సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో మద్రాసు వర్సిటీ, అన్నావర్సిటీ, పెరియార్, తిరువళ్లువర్, భారతీయార్, మనోన్మనియం సుందరనార్, అంబేడ్కర్ న్యాయ వర్సిటీ, జయలలిత ఫిషరీస్ వర్సిటీ సహా 15కుపైగా విశ్వవిద్యాలయాలు ఉన్న విషయం తెలిసిందే. ఈ విశ్వవిద్యాలయాల పరిఽధిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలు, ఇతర కోర్సులకు సంబంధించిన కళాశాలలు అనేకం ఉన్నాయి. అన్నావర్సిటీ పరిఽధిలో అయితే, 430 ఇంజినీరింగ్ కళాశాలలు ఉన్నా యి. మిగిలిన వర్సిటీల పరిధిలో ఆర్ట్స్ అండ్ సైన్స్ కోర్సులు, ఇతర వృత్తి శిక్షణ కోర్సులు అమల్లో ఉన్నాయి. ఆయా వర్సిటీలలో విభిన్న పాఠ్యాంశాల బోధన జరుగుతోంది. ఒకే విద్యా విధానం కింద రాష్ట్రంలోని అన్ని వర్సిటీలలో ఒకే రకమైన పాఠ్యాంశాలు బోధించే విధంగా కొత్త నినాదాన్ని ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. అలాగే, రాష్ట్రానికి ప్రత్యేక విద్యా విధానం అమలు కసరత్తులు వేగవంతం చేశారు. ఈ పరిస్థితులలో విద్యావిధానం, ఒకే పాఠ్యాంశం అంశాలపై చర్చించేందుకు శుక్రవారం వీసీలతో పొన్ముడి సమావేశమయ్యారు. అన్నావర్సిటీలో జరిగిన సమావేశంలో అన్ని వర్సిటీల వీసీలు హాజరయ్యారు. ఆయా వర్సిటీలలోని సమస్యలపై తొలుత చర్చించారు. వీసీల అభిప్రాయాలను మంత్రి స్వీకరించారు. దివంగత మాజీ సీఎం కరుణానిధి శతజయంతి ఉత్సవాల నిర్వహణపై సమీక్షించారు. సమావేశంలో వీసీలకు మంత్రి ప్రత్యేక ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం. గవర్నర్ నుంచి వచ్చే ఆదేశాలు, అంశాలకు వ్యతిరేకంగా ఈ ఆదేశాలు జరిగినట్టు తెలిసింది. తనను టార్గెట్ చేసిన జరిగిన ఈడీ దాడుల టెన్షన్ పరిణామాల అనంతరం తన శాఖలోని కీలక అంశాలపై మంత్రి తాజాగా దృష్టి పెట్టడం గమనార్హం.


