ప్రాణాలు అర చేతిలో.. రెండు రోజులుగా నడి సంద్రంలోనే! | - | Sakshi
Sakshi News home page

ప్రాణాలు అర చేతిలో.. రెండు రోజులుగా నడి సంద్రంలోనే!

Apr 14 2023 1:52 AM | Updated on Apr 14 2023 12:07 PM

- - Sakshi

సాక్షి, చైన్నె: పడవ మరమ్మతులకు గురి కావడంతో రెండు రోజుల పాటు ముగ్గురు జాలర్లు నడి సముద్రంలో బిక్కుబిక్కు మంటూ కాలం గడిపారు. ఎట్టకేలకు గురువారం ఉదయం అటు వైపుగా వచ్చిన మరో పడవలోని వారు ఆ ముగ్గురు జాలర్లను రక్షించారు. వివరాలు.. నాగపట్నం జిల్లా వేదారణ్యం సమీపంలోని ఆరుకాట్టు దురై గ్రామానికి చెందిన పరమ శివం, వేదయ్యన్‌, పన్నీరు అనే జాలర్లు చేపల వేట నిమిత్తం సోమవారం అర్ధరాత్రి సమయంలో సముద్రంలోకి వెళ్లారు.

మరుసటి రోజు సాయంత్రం సమయానికి వీరి పడవ ఒడ్డుకు చేరాల్సి ఉంది. అయితే రాలేదు. దీంతో జాలర్ల కుటుంబాలలో ఆందోళన నెలకొంది. బుధవారం మత్స్య శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఈ పరిస్థితులలో గురువారం ఉదయం ముగ్గురు జాలర్లు వెళ్లిన పడవను మరో పడవలోని జాలర్లు ఒడ్డుకు చేర్చారు. వేటకు వెళ్లిన ఈ ముగ్గురు జాలర్లు ఉన్న పడవ మంగళవారం మధ్యాహ్నం సమయంలో మరమ్మతులకు గురైంది.

ఫలితంగా నడి సముద్రంలో వారు సాయం కోసం ఎదురు చూస్తూ ప్రాణాలను అర చేతిలో పెట్టుకుని ఎదురు చూశారు. తమ వద్ద ఉన్న సమాచార పరికరాలు పనిచేయక పోవడంతో విషయాన్ని ఎవరి దృష్టికి తీసుకెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. తమ వద్ద ఉన్న నీటిని, ఆహారాన్ని పొదుపుగా వాడుకున్నారు. బుధవారం కూడా సముద్రంలోనే కాలం గడిపారు.

గురువారం వేకువ జామున అటు వైపుగా ఓ పడవ రావడంతో ఈ ముగ్గురిలో ఆనందం వెల్లివిరిసింది. తమ దీనావస్థను మరో పడవలో ఉన్న వారి దృష్టికి జాలర్లు తీసుకెళ్లారు. దీంతో వారు స్పందించి తమ వద్ద ఉన్న తాళ్ల సాయంతో ఆ పడవను ఒడ్డుకు తీసుకొచ్చారు. తర్వాత బాధిత జాలర్లను ఆసుపత్రికి తరలించారు. వారికి కావాల్సిన ఆహారం అందజేశారు. సమాచారం అందుకున్న మత్స్యశాఖ అధికారులు, జాలర్ల సంఘాల ప్రతినిధులు బాధితులను పరామర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement