చివ్వెంల(సూర్యాపేట) : న్యాయవాదులు బార్ అండ్ బెంచ్ రిలేషన్ మెయింటెన్ చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.లక్ష్మీశారద అన్నారు. శుక్రవారం రాత్రి సూర్యాపేట బార్ అసోషియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ సామల రాంరెడ్డికి నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్‌గా జిల్లా వాసి ఎంపిక కావడం అభినందనీయమన్నారు. అనంతరం బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ చైర్మన్ రాంరెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని కోర్టుల్లోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని కోరారు. అనంతరం సూర్యాపేట, కోదాడ, తుంగతుర్తి బార్ అసోషియేషన్ నాయకులు చైర్మన్‌ను పూలమాల, శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా మొదటి అదనపు న్యాయమూర్తి పి.శివరాంప్రసాద్, సీనియర్ సివిల్ జడ్జి ఫర్హీన్ కౌసర్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి గోపు రజిత, బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ వైస్ చైర్మన్ చలకాని వెంకట్ యాదవ్, బార్ అసోషియేషన్ అధ్యక్షుడు నూకల సుదర్శన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి తల్లమళ్ల హస్సేన్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.
జిల్లా ప్రధాన న్యాయమూర్తి
పి. లక్ష్మీశారద


