కోదాడ: నూతన బస్టాండ్ నిర్మాణం కోసమంటూ పాత బస్టాండ్ ఆవరణలో ఉన్న దుకాణాలను ఆర్టీసీ అధికారులు ఖాళీ చేయించారు. కానీ రెండు నెలలుగా వాటిని ఉపయోగించకుండా అలాగే వదిలేశారు. వాటిని పాక్షికంగా కూల్చివేయడంతో ఆ ప్రాంతమంతా నడవలేని, నిలబడలేని పరిస్ధితి నెలకొంది. ప్రతినెలా లక్షల రూపాయల అద్దెలు వచ్చే దుకాణాలను ఖాళీ చేయించి వాటిని వినియోగించకుండా ఖాళీగా ఉంచడంతో ఆర్టీసీ సంస్థకు లక్షల్లో నష్టం వాటిల్లుతోంది. తాత్కాలిక బస్టాండ్ కోసం అంటూ చెప్పిన అధికారులు.. రెండు నెలలుగా వాటిని అలాగే వదిలేయడం ఏమిటని స్థానికులు, వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు.
ఆదాయానికి గండి
కోదాడలో ఆధునిక ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణ పనులను కాంట్రాక్టర్ రెండు నెలల క్రితం మొదలు పెట్టాడు. ఇందులో భాగంగా ప్రస్తుత బస్టాండ్ ముందు ప్రాంతంలో తాత్కాలిక బస్టాండ్ నిర్మాణం చేస్తామని చెప్పి జాతీయ రహదారి వైపున ఉన్న 20 దుకాణాలను వెంటనే ఖాళీ చేయించారు. తాత్కాలిక బస్టాండ్ నిర్మాణం చేసినా తమ దుకాణాలు అడ్డురావని, వెనుక వైపు ఖాళీ స్థలం ఉందని, అక్కడ ఏర్పాటు చేయాలని వ్యాపారులు ఎంత చెప్పినా అధికారులు వినిపించుకోలేదు. యుద్ధ ప్రాతిపదికన రెండు నెలల క్రితం దుకాణాలను ఖాళీ చేయించారు. దుకాణాలు ఖాళీ చేయించిన అధికారులు వాటిని తొలగించకుండానే తాత్కాలిక బస్టాండ్ నిర్మాణం చేసి రెండు నెలలుగా బస్సులను నడుపుతున్నారు. దుకాణ సముదాయాన్ని ఉపయోగించకుండా రెండు నెలలుగా ఖాళీగానే ఉంచుతున్నారు. దాంతో ఒక్కో దుకాణానికి రూ.30 వేల చొప్పున నెలకు 6 లక్షల రూపాయల ఆదాయాన్ని సంస్థ్ధ కోల్పోతోంది.
గుక్కెడు నీరు కరువు
నూతన బస్టాండ్ నిర్మాణం కోసం పాత బస్టాండ్ ఆవరణలో ఉన్న క్యాంటీన్‌తో పాటు ఇతర దుకా ణాలను కూడా అధికారులు పూర్తిగా తొలగించారు. దాంతో దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులకు గుక్కెడు మంచినీరు దొరకని పరిస్థితి నెలకొంది. ప్రయాణికుల అసవరాలను దృష్టిలో పెట్టుకొని ఒక్క దుకాణమైనా ఏర్పాటు చేయాలని ప్రయాణికులు విన్నవిస్తున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. ఇప్పుడే పరిస్ధితి ఇలా ఉంటే రానున్న వేసవిలో మరింత ఇబ్బందికరంగా ఉంటుందని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి ప్రయాణికులకు కనీస వసతులు కల్పించేలా తగిన ఏర్పాట్లు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
హడావిడిగా ఆర్టీసీ బస్టాండ్‌లోని దుకాణాల కూల్చివేత
ఆర్టీసీ ఆదాయానికి గండి
వసతుల్లేక ప్రయాణికుల అవస్థలు
బురదమయంగా మారిన
తాత్కాలిక బస్టాండ్
ఇది కోదాడ ఆర్టీసీ బస్టాండ్ వద్ద ప్రస్తుత పరిస్థితి. నూతన బస్టాండ్ నిర్మాణంలో భాగంగా బస్సుల రాకపోకల కోసం ఏర్పాటు చేసిన తాత్కాలిక బస్టాండ్ ఇది. రెండు రోజుల క్రితం కురిసిన వర్షానికి నీరు నిలువడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా అధికారులు, పనులు చేపట్టే కాంట్రాక్టర్ పట్టించుకోవడం లేదు. ఇక్కడి నుంచే బస్సులు రాకపోకలు సాగిస్తుండడంతో బురదనీరు ప్రయాణికుల మీద పడుతుంది. తాత్కాలిక బస్టాండ్‌లో ప్రయాణికులు కూర్చోవడానికి ఏర్పాట్లు చేయకపోవంతో మహిళలు, వృద్ధులు, పిల్లలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.


