భానుపురి (సూర్యాపేట) : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల విద్యా సామర్థ్యాన్ని మెరుగు పరిచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఎంఈఓలు, కాంప్లెక్స్ హెచ్‌ఎంలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలుగు, గణితం, ఇంగ్లిష్ సబ్జెక్టుల్లో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, ప్రతిరోజూ గంటపాటు రెమిడియల్ తరగతులు నిర్వహించాలని సూచించారు. ప్రతిరోజూ ఎఫ్‌ఆర్‌ఎస్ హాజరును పర్యవేక్షిస్తూ 90 శాతానికి పైగా హాజరు నమోదయ్యేలా చూడాలన్నారు. అపార్ ఐడీ జనరేషన్‌ను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. పీఎంశ్రీ, సమగ్ర శిక్ష నిధులు, పీఎం పోషణ బడ్జెట్‌ను సక్రమంగా వినియోగించాలన్నారు. పాఠశాలల్లో డ్రగ్ ఫ్రీ వాతావరణం కల్పించేందుకు కృషి చేయాలని, మధ్యాహ్న భోజన పథకం డాష్‌బోర్డును ప్రతి వారం పర్యవేక్షించాలని ఆదేశించారు. స్పర్శ్ బిల్లుల ఆమోదంలో ఉన్న సమస్యలను డీటీఓను సమావేశానికి పిలిపించి పరిష్కరించారు. సమావేశంలో జిల్లా విద్యాశాఖ కోఆర్డినేటర్లు వై.రాంబాబు, శ్రవణ్, ఈ.హరికృష్ణ, టి.పూలన్, సూర్యనారాయణ, సూపరింటెండెంట్ మోహన్, ఎఫ్‌ఎల్‌ఎన్ సెల్ సభ్యులు, ఎంఈఓలు, కాంప్లెక్స్ హెచ్‌ఎంలు పాల్గొన్నారు.
జిల్లా విద్యాశాఖ సమీక్షలో కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్


