ట్రాఫిక్‌ ఇక్కడ.. పనులు అక్కడ | - | Sakshi
Sakshi News home page

ట్రాఫిక్‌ ఇక్కడ.. పనులు అక్కడ

Oct 24 2026 11:07 AM | Updated on Oct 24 2026 11:07 AM

అధికారులు స్పష్టత ఇవ్వాలి..

కోదాడ : నిత్యం ట్రాఫిక్‌తో సతమతమవుతున్న పట్టణ ప్రజలు.. రోడ్డు విస్తరణతో కొంత ఊరట లభిస్తుందని భావించారు. కానీ అధికారుల తీరుతో వారు అయోమయ స్థితిని ఎదుర్కొంటున్నారు. రూ.30 కోట్ల ఎండీఆర్‌ నిధులతో చేపట్టిన కోదాడ–అనంతగిరి రోడ్డు విస్తరణలో అధికారుల తీరుపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ట్రాఫిక్‌ సమస్య తీవ్రంగా ఉన్న నాగార్జున సెంటర్‌ నుంచి శ్మశానవాటిక వరకు ముందుగా రోడ్డు వెడల్పు పనులు చేపట్టాల్సి ఉండగా.. అధికారులు మాత్రం రద్దీ అంతగా లేని రంగని గుడి ప్రాంతంలో పనులు ప్రారంభించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇరుకు రోడ్డుతో ఇక్కట్లు

కోదాడలోని నాగార్జున సెంటర్‌ నుంచి పబ్లిక్‌ క్లబ్‌ వరకు అనంతగిరి రోడ్డు ఇరుకుగా మారింది. 40 అడుగులు ఉండాల్సిన రోడ్డు ఆక్రమణలతో 25 అడుగులకు కుంచించుకు పోయింది. వ్యాపార సంస్థల బోర్డులు సైతం రోడ్డు మీదికి రావడంతో ఎదురెదురుగా రెండు వాహనాలు వస్తే దారిలేని పరిస్థితి నెలకొంది. రెండు మండలాల ప్రజలతో పాటు నయానగర్‌ వాసులు ఈ రోడ్డు గుండానే ప్రయాణిస్తుంటారు. దాంతో పాటు రెండు ఇంజనీరింగ్‌ కళాశాలలు, పదికి పైగా పాఠశాలల బస్సులు, వందల సంఖ్యలో ఇతర వాహనాలు ఇదే రోడ్డు గుండా రాకపోకలు సాగిస్తుండటంతో ఉదయం, సాయంత్రం వేళల్లో ట్రాఫిక్‌తో స్థానికులు సతమతమవుతున్నారు. రోడ్డును విస్తరిస్తే తప్ప సమస్య పరిష్కారం కాదంటూ ట్రాఫిక్‌ పోలీసులు సైతం చేతులెత్తేయడంతో ప్రయాణికులకు అవస్థలు తప్పడం లేదు.

విస్తరణపై స్పష్టత కరువు

జాతీయ రహదారి నుంచి అనంతగిరి మండల కేంద్రం వరకు 6.6 కిలోమీటర్ల మేర డబుల్‌ రోడ్డు నిర్మాణ పనులకు ఈ ఏడాది జూలై 11న కోదాడ ఎమ్మెల్యే పద్మావతి శంకుస్థాపన చేశారు. నాగార్జున సెంటర్‌ నుంచి శ్మశానవాటిక వరకు రోడ్డును విస్తరించాలంటే పలు భవనాలను పాక్షికంగా తొలగించాల్సి ఉంటుంది. కోదాడ మాజీ ఎమ్మెల్యే చందర్‌రావు, కాంగ్రెస్‌ నాయకుడు లక్ష్మీనారాయణరెడ్డి తమ భవనాలను తొలగించేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. కానీ, రోడ్డును ఎంత వెడల్పు చేస్తారు? భవనాలను ఏ మేరకు తొలగిస్తారు? అన్నదానిపై అధికారులు ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వడం లేదు. కనీస సమాచారం ఇవ్వకుండా నాలుగు నెలలుగా నాన్చుతుండటంతో.. ఆయా భవనాల యజమానులు, వ్యాపారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అధికారుల తీరుతో ఆయా ప్రాంతాల్లో కొత్త భవనాలు నిర్మించుకునే వారు సైతం ఇబ్బంది పడుతున్నారు.

కోదాడ – అనంతగిరి రోడ్డు విస్తరణలో విచిత్ర స్థితి

అవసరం ఉన్నచోట వదిలేసి..

రద్దీ లేనిచోట పనులు ప్రారంభం

నాగార్జున సెంటర్‌ నుంచి క్లబ్‌ వరకు ట్రాఫిక్‌తో నిత్యం నరకయాతన

మార్కింగ్‌ వేయక పోవడంతో

అయోమయంలో భవన యజమానులు

అనంతగిరి రోడ్డులో మాకు స్థలం ఉంది. కొత్త భవనం నిర్మించుకుందామంటే రోడ్డు విస్తరణ ఎంతవరకు ఉంటుందో తెలియక ఆగిపోయాం. అధికారులు ముందుగా ఈ రోడ్డులోని భవన యజమానులతో సమావేశం ఏర్పాటు చేసి పూర్తి సమాచారం ఇవ్వాలి. ఆ తర్వాతే భవనాలకు మార్కింగ్‌ చేయాలి. విస్తరణ పనులు పట్టణం వైపు నుంచి చేపడితే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది.

– కొల్లు వెంకటేశ్వరరావు, కోదాడ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement