భానుపురి (సూర్యాపేట) : రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం త్వరలో శుభవార్త అందించనుంది. చౌకధరల దుకాణాల ద్వారా ప్రస్తుతం అందిస్తున్న బియ్యానికి తోడు ఆరు రకాల నిత్యవసర వస్తువులను అందించేలా ప్రణాళికలను రూపొందిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో.. పెరిగిన నిత్యావసరాల ధరలతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని నిత్యావసర సరుకులు అందిస్తే ఏ మేరకు ఆర్థిక భారం పడుతుందనే వివరాలను సేకరిస్తున్నది. ప్రభుత్వం ఆరు రకాల నిత్యవసర సరుకులను అందిస్తే జిల్లాలో 3.70 లక్షల రేషన్ కార్డుదారులకు లబ్ధి చేకూరనుంది.
పెరిగిన ధరలు..!
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎల్‌నినో పరిస్థితులతో వర్షాభావం కారణంగా అన్ని రకాల పంటల దిగుబడి తగ్గిపోయింది. ఇదే అదనుగా వ్యాపారులు నిత్యావసర సరుకుల కృత్రిమ కొరత సృషి్‌ూట్స్త వాటి ధరలను అమాంతం పెంచుతున్నానరు. ఇప్పటికే కిలో బియ్యం వంద రూపాయలకు చేరువలో ఉంది. దాంతో పాటు కూరగాయలు, చక్కెర, పప్పులు, ఇతర వంట సామాగ్రి ధరలు కూడా భగ్గుమంటున్నాయి. రానున్న రోజుల్లో వీటి ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది.
ఆరు రకాల వస్తువులు
ప్రస్తుత పరిస్థితుల్లో పేద ప్రజలపై భారం పడకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా రేషన్ దుకాణాల ద్వారా ప్రస్తుతం ఇస్తున్న సన్న బియ్యంతో పాటు నిత్యావసర సరుకులను కూడా ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ విషయమై ప్రణాళికలు రూపొందించాలని సంబంధిత శాఖ మంత్రి ఉత్తంకుమార్‌రెడ్డి ఇటీవల అధికారులను ఆదేశించారు. బియ్యంతో పాటు గోధుమపిండి, కందిపప్పు, పామాయిల్, చక్కెర, చింతపండు, కారంపొడి వంటి నిత్యవసర సరుకులను సబ్సిడీ ధరకు అందించేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. దీంతో ప్రభుత్వంపై పడే ఆర్థిక భారం, ప్రజలకు చేకూరే లబ్ధి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు.
ముందస్తు
నిల్వలపై దృష్టి
ఇటీవల మంత్రి ఉత్తంకుమార్‌రెడ్డి చేపట్టిన సమీక్ష సమావేశంలో సరుకుల సేకరణ, పంపిణీ విధానంపై అధికారులను నివేదిక కోరినట్లు తెలుస్తున్నది. దాదాపు 14 నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు సేకరించాలని ప్రభుత్వం భావిస్తున్నది. వీటి సేకరణతో ప్రస్తుతం మార్కెట్లో పెరుగుతున్న ధరల నుంచి పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఉపశమనం కలగనుంది. ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడే ఆహార కొరతను సైతం అధిగమించేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
చౌకధరల దుకాణాల ద్వారా అందించేందుకు ప్రభుత్వం కసరత్తు
బియ్యంతో పాటు ఆరు రకాల సరుకులు
ఎల్‌నినో నేపథ్యంలో ప్రజలపై భారం పడకుండా ఉండేందుకే..
జిల్లాలో 3.70 లక్షల రేషన్ కార్డులు


