నల్లగొండ : ఎల్నినో ప్రభావంతో రానున్న రోజుల్లో తాగునీరు, వ్యవసాయం, విద్యుత్ తదితర రంగాల్లో సమస్యలు తలెత్తకుండా ముందస్తు కార్యాచరణ సిద్ధం చేసి అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, శిక్షణ శాఖ కార్యదర్శి, ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రత్యేక అధికారి దాసరి హరిచందన ఆదేశించారు. శుక్రవారం నల్లగొండ కలెక్టరేట్లో నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులతో ఎల్నినో ప్రభావంపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాల్లో ఇప్పటికే కరువు పరిస్థితులు నెలకొన్నాయని, డిసెంబర్ చివ రి నాటికి ఎల్నినో ప్రభావం తీవ్రస్థాయికి చేరి వ్యవసాయం, భూగర్భజలాలు, తాగునీరు, విద్యు త్ రంగాలపై పడే అవకాశం ఉన్నందన్నారు.
ప్రతి ఇంటికీ తాగునీరు అందేలా చూడాలి
ఎల్నినో పరిస్థితుల్లో తాగునీటికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని హరిచందన స్పష్టం చేశారు. నాలుగైదు నెలలపాటు ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికీ తాగునీరు అందేలా సూక్ష్మస్థాయి ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్లకు సూచించారు. భూగ ర్భజలాల లభ్యత, బోర్లలో నీటి పరిస్థితి, గ్రామాల్లో ఉన్న నీటి ట్యాంకులు, వాటి పనితీరును అంచనా వేసి నీటిని పొదుపుగా వినియోగించుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
ప్రత్యామ్నాయ పంటలు మేలు
రబీ సీజన్లో రైతులు వరికి బదులుగా తక్కువ నీటితో పండించే పెసర్లు, ఉలవలు, కందులు, ఉద్యాన పంటలు సాగుచేసేలా వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన కల్పించాలని సూచించారు. నీరు, విద్యుత్ పొదుపునకు సూక్ష్మ సేద్యం కింద బిందు, తుంపర సేద్య పద్ధతులను ప్రోత్సహించేలా కార్యాచరణ రూపొందించాలని చెప్పా రు. పశువులకు తాగునీరు, పశుగ్రాసం కొరత రాకుండా వనరులను గుర్తించాలని ఆదేశించారు.
నీటి సంరక్షణ చాలా అవసరం
భూగర్భ జలాలను పెంపొందించేందుకు వీబీజీ రాంజీ పథకం కింద పెద్ద ఎత్తున నీటి సంరక్షణ పనులు చేపట్టడం చాలా అవసరమని ఆమె అన్నారు. ప్రతి గ్రామంలో మ్యాజిక్ సోక్పిట్లు, కమ్యూనిటీ సోక్పిట్లు, నీటి నిల్వ నిర్మాణాలు చేపట్టాలని తెలిపారు. విద్యుత్ వినియోగం, నష్టాలను తగ్గించేందుకు సోలార్ విద్యుత్, సోలార్ బ్యాటరీలు, సోలార్ మోటార్లు, సూర్యఘర్ వంటి పథకాలపై రైతులకు, ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.
కూలీలకు వసతులు కల్పించండి
ఉపాధి పనులు జరిగే ప్రాంతాల్లో కూలీలకు తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ప్రథమ చికిత్స సౌకర్యాలు, నీడ కల్పించాలన్నారు. మండల ప్రత్యేకాధికా రులు ప్రతివారం పరిస్థితులను సమీక్షించి ప్రణాళికలు రూపొందించాలని స్పష్టం చేశారు. సమావేశంలో సూర్యాపేట కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్, యాదాద్రి భువనగిరి కలెక్టర్ అనురాగ్ జయంతి తమ జిల్లాల్లో వ్యవసాయం, భూగర్భ జలాలు, విద్యుత్, తాగునీరు, పశుగ్రాసం, సాగునీటి పరిస్థితులను వివరించారు. సమావేశంలో మూడు జిల్లాల అదనపు కలెక్టర్లు, వివిధ శాఖల అధికా రులు, తదితరులు పాల్గొన్నారు.
ఫ తాగునీటి సరఫరాకు తొలి ప్రాధాన్యం
ఫ రబీలో వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగుచేయాలి
ఫ నల్లగొండలో జరిగిన సమీక్షలో ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి దాసరి హరిచందన


