‘బతుకమ్మ’కు చీరల్లేవ్‌..! | - | Sakshi
Sakshi News home page

‘బతుకమ్మ’కు చీరల్లేవ్‌..!

Oct 17 2026 8:24 AM | Updated on Oct 17 2026 8:24 AM

ఇందిరాగాంధీ జయంతి నాటికి..

భానుపురి (సూర్యాపేట) : ఈ సారి సద్దుల బతుకమ్మకు మహిళా సంఘాల సభ్యులకు చీరలు అందేలా కనిపించడం లేదు. బతుకమ్మ పండుగ నాటికి పంపిణీ చేయాలని ప్రభుత్వం మొదటగా భావించినప్పటికీ అనివార్య కారణాలతో అందించడం లేదు. నవంబర్‌ 19న ఇందిరాగాంధీ జయంతిని పండుగ వాతావరణంలో నిర్వహించాలని నిర్ణయించిన ప్రభుత్వం అదేరోజు మహిళా సంఘాల సభ్యులకు చీరలు పంపిణీ చేసి.. కొన్ని సంక్షేమ పథకాలను ప్రారంభించాలనే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బతుకమ్మ నాటికి ఇవ్వాల్సిన చీరల పంపిణీ ఆలస్యం అవుతోంది.

బతుకమ్మ కానుకగా ప్రారంభమై..

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండుగను వైభవంగా నిర్వహిస్తోంది. ఈ క్రమంలో మహిళలకు కానుకగా ప్రభుత్వమే బతుకమ్మ చీరలను పంపిణీ చేయాలని భావించి.. రేషన్‌ కార్డులో 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు చీరె అందిస్తూ వచ్చింది. దాంతో పాటు రాష్ట్రంలోని చేనేత కార్మికులకు ఉపాధి అవకాశాలు సైతం కల్పించేందుకు చీరల తయారీ ఆర్డర్లు ఇచ్చింది. ప్రభుత్వం ఒక్కో చీరకు ఇచ్చే కూలి తక్కువగా ఉండడంతో నాణ్యత, డిజైన్లు సైతం సరిగా లేకపోవడంతో ప్రభుత్వం క్రమం తప్పకుండా బతుకమ్మ నాటికి మహిళలకు పంపిణీ చేసినా అందరు మహిళలు వీటిని ధరించేందుకు ఇష్టపడలేదు.

మహిళా సంఘాలకే పరిమితం

మూడేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం బతుకమ్మ చీరలను అందరికి కాకుండా మహిళా సంఘాల్లో సభ్యులుగా ఉన్న వారికి మాత్రమే ఇవ్వడం ప్రారంభించింది. వారికిచ్చే చీరను నాణ్యతతో తయారు చేసేలా డిజైన్లలో మార్పులు చేసింది. నాటి నుంచి జిల్లాలో బతుకమ్మ పండుగ నాటికి మహిళా సంఘాల సభ్యులకు చీరలు పంపిణీ చేసే ఆనవాయితీ మారుతూ వస్తోంది. గతేడాది కూడా చీరల పంపిణీ ఆలస్యమైంది. ఈ సంవత్సరం సద్దుల పండుగ నాటికి మహిళా సంఘాల సభ్యులకు చీరలు ఇవ్వాలని భావించినా.. సమయానికి అందకపోవడంతో గతేడాది పరిస్థితే పునరావృతమవుతోంది.

సూర్యాపేట జిల్లాలో 2.17 లక్షల మంది మహిళా సంఘాల సభ్యులు ఉన్నారు. ఇందిరాశక్తి పథకం కింద వారికి చీరలను పంపిణీ చేస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లాకు 1,09,142 చీరలు చేరాయి. జిల్లాలోని హుజూర్‌నగర్‌, కోదాడ నియోజకవర్గాల పరిధిలో ఉన్న గోదాముల్లో వీటిని భద్రపర్చారు. మరో 1,07,858 చీరలు రావాల్సి ఉంది. ఇప్పటికే జిల్లాకు చేరిన చీరలు అనుకున్న సమయానికి కంటే ముందుగానే వచ్చినా.. చివరి విడత చీరలు రాకుండా పోయాయి. సద్దుల పండుగ నాటికి చీరలు అందే పరిస్థితి లేకపోవడంతో ప్రభుత్వం ఇందిరాగాంధీ జయంతిని పండుగ వాతావరణంలో జరిపి అదేరోజు చీరలు అందించాలని భావిస్తున్నట్లు సమాచారం. దాంతో బతుకమ్మ నాటికి జిల్లాలోని మహిళా సంఘాల సభ్యులకు చీరలు అందకుండా పోతున్నాయి.

ఫ జిల్లాకు పూర్తిస్థాయిలో చేరని చీరలు

ఫ దాంతో పంపిణీని వాయిదా

వేసినట్లు సమాచారం

ఫ ఇందిరాగాంధీ జయంతి రోజున

పంపిణీ చేసే యోచనలో ప్రభుత్వం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement