కోదాడ : దొంగలను పట్టుకుని వారికి శిక్షలు పడేలా చూడాల్సిన పోలీసులే వారిని కేసుల నుంచి తప్పించడానికి లంచం పుచ్చుకున్నారనే ఆరోపణలు కోదాడ డివిజన్ పరిధిలో వెల్లువెత్తుతున్నాయి. రైతుల పశువులను రాత్రి సమయాల్లో దొంగతనం చేసి ఇతర ప్రాంతాల్లో అమ్ముతున్న దొంగలను నాలుగు నెలల క్రితం చిలుకూరు, అనంతగిరి పోలీసులు పట్టుకున్నారు. శిక్ష పడకుండా కాపాడుతానని, పోలీసులకు డబ్బులు ఇవ్వాలని అధికార పార్టీ నాయకుడు ఓ బాధితుడి నుంచి డబ్బులు వసూలు చేశాడనే ఆరోపణలు న్నాయి. ఈ వ్యవహారానికి సంబంధించిన ఆడియో గురువారం కోదాడలోని వివిధ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుండడం చర్చనీయాంశంగా మారింది.
అసలేం జరిగిందంటే..
కోదాడ మున్సిపల్ పరిధిలోని శ్రీరంగాపురంలో నివాసం ఉండే కొందరు చిలుకూరు, అనంతగిరి మండలాల పరిధిలో రాత్రి సమయంలో ఆరుబయట ఉండే గేదెలను వాహనంలో ఎక్కించుకొని ఇతర ప్రాంతాల్లోని సంతల్లో అమ్ముతున్నారని ఫిర్యాదులు రావడంతో పోలీసులు నిఘా పెట్టారు. కోదాడ డివిజన్‌లోని రెండు పోలీస్ స్టేషన్‌లకు చెందిన పోలీసులు ముగ్గురు నిందితులను పట్టుకున్నారు. ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు. గేదెలను అప్పటికే అమ్మివేయడంతో రికవరీగా సదరు నిందితుడి నుంచి సుమారు రూ.3 లక్షల వరకు కోర్టులో డిపాజిట్ చేయించినట్లు సమాచారం. ఇదే సమయంలో రంగ ప్రవేశం చేసిన కోదాడ పట్టణ పరిధిలోని లక్ష్మీపురానికి చెందిన అధికార పార్టీ నాయకుడు పోలీసులతో మాట్లాడి శిక్ష పడకుండా చూస్తానని చెప్పి తమ వద్ద దశల వారీగా రూ.18 లక్షలు తీసుకున్నాడని ప్రధాన నిందితుడు ఆరోపిస్తున్నాడు. ఈ నెల 6న అనంతగిరి పోలీసులు తనను అరెస్ట్ చేసి జైలుకు పంపారని ప్రధాన నిందితుడు తెలిపాడు. మధ్యవర్తిని డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరగా తాను పోలీసులకు డబ్బులు ఇచ్చానని, మళ్లీ అడిగితే కేసులు పెట్టిస్తానని సదరు నాయకుడు తమను బెదిరిస్తున్నాడని బాధితుడితో పాటు అతని తల్లి ఆరోపిస్తున్నారు. ఈ మేరకు గురువారం వారు పట్టణ పోలీసులను ఆశ్రయించడంతో వారు తమ ఫిర్యాదును తీసుకోలేదని, తాము ఎస్పీకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.
రెండు స్టేషన్ల పరిధిలో రూ.లక్షలు లంచంగా వసూలు
దొంగలకు పోలీసులకు మధ్యవర్తులుగా
రాజకీయ నాయకులు
డబ్బులు తీసుకొని రిమాండ్ చేయడంతో
అడ్డం తిరిగిన నేరస్తులు
కోదాడలో చర్చనీయాంశంగా మారిన ఆడియో
ఫిర్యాదు స్వీకరణకు పట్టణ పోలీసుల నిరాకరణ


