‘సర్‌’ ముసాయిదా జాబితా ప్రకటించిన జిల్లా ఎన్నికల అధికారి | - | Sakshi
Sakshi News home page

‘సర్‌’ ముసాయిదా జాబితా ప్రకటించిన జిల్లా ఎన్నికల అధికారి

Aug 18 2026 7:58 AM | Updated on Aug 18 2026 7:58 AM

భానుపురి (సూర్యాపేట) : జిల్లా ఓటరు ముసాయిదా జాబితా విడుదలైంది. దాదాపు 9,11,945 మంది ఓటర్లు ఉన్నట్లు జిల్లా ఎన్నికల అధికారి ప్రకటించారు. ఇందులో పురుషులు 4,47,090 మంది, మహిళలు 4,64,806 మంది ఉన్నారు. మరో 49 మంది ఇతరులకు ఈ జాబితాలో చోటు దక్కింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో జిల్లాలో చేపట్టిన సర్‌ (స్పెషల్‌ ఇన్సెంటివ్‌ రివిజన్‌) కారణంగా 96,307 ఓట్లు ఓటర్ల జాబితా నుంచి తొలగించినట్లయింది. ఈ ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం పోర్టల్‌తో పాటు జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయం, ఈఆర్వో, ఏఈఆర్వో కార్యాలయాలు, సంబంధిత పోలింగ్‌ సెంటర్లలోనూ అందుబాటులో ఉంచారు. ఈ ఓటర్‌ జాబితాలో అర్హులైన ఓటర్ల పేరు లేకుంటే అభ్యంతరాలు స్వీకరించి విచారణ అనంతరం చోటు కల్పించనున్నారు. ఇందుకు నెల రోజుల గడువు ఉండగా.. తుది జాబితాను అక్టోబర్‌ 19న ప్రచురించనున్నారు.

సర్‌కు ముందు..

కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన సర్‌ ప్రక్రియకు ముందు జిల్లాలో 10,08,252 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలో 2,49,904 మంది, కోదాడలో 2,48,175 మంది, సూర్యాపేటలో 2,46,432 మంది, తుంగతుర్తి నియోజకవర్గంలో 2,63,741 మంది చొప్పున ఓటర్లు నమోదయ్యారు. వీరందరికీ ఎన్యూమరేషన్‌ ఫారాలు అందించారు. 9,11,945 ఎన్యూమరేషన్‌ ఫారాలు డిజిటలైజ్‌ అయ్యాయి. మిగతా వాటిలో 26,059 మంది మృతిచెందిన ఓటర్లు, 48,310 మంది శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లిన ఓటర్లు, 13,016 మంది డబుల్‌ ఓటర్లు, 6,862 మంది గైర్హాజరు కాగా, ఇతర కారణాలతో మరో 2,060 మంది ఎన్యూమరేషన్‌ ఫారాలతో మొత్తం 96,307 మంది ఓటర్ల ఫారాలు తొలగింపు జాబితాలో చేర్చారు.

అర్హుల ఓట్లు పోకుండా..

ఎన్యూమరేషన్‌ దశలో నిర్ణీత గడువులో ఫారం సమర్పించలేకపోయిన అర్హులైన ఓటర్ల ఓటు పోకుండా, ఐదైనా పొరపాట్లతో ఫారాలు నింపిన తుది ఓటరు జాబితాలో ఓటు హక్కు కల్పించేలా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటుంది. ఇందుకోసం తప్పుగా ఫారాలు నింపడం, ఫారం సమర్పించని వారికి నోటీసులు అందించనున్నారు. అలాగే అన్ని అర్హతలు ఉండి జాబితాలో పేరు లేకున్నా ఓటర్లు అప్పీల్‌ చేసుకునే వెసులు బాటు ఉంది. ముసాయిదా జాబితా ప్రకటించిన నాటినుంచి నెల రోజుల పాటు సెప్టెంబర్‌ 16వ తేదీ వరకు వీటిని స్వీకరించనున్నారు. ఫారం–6 ద్వారా కొత్త ఓటరు నమోదుకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించగా.. 6ఏతో విదేశాల్లో నివసిస్తున్న భారతీయ ఓటర్ల నమోదు, ఫారం–7 ద్వారా ప్రతిపాదిత చేర్పుపై అభ్యంతరాలు, పేర్లు తొలగింపునకు దరఖాస్తు, ఫారం–8 ద్వారా నివాస మార్పు, ఓటరు వివరాల సవరణకు దరఖాస్తు చేసుకునే వీలును కేంద్ర ఎన్నికల సంఘం కల్పించింది. నోటీసులు, క్లెయిమ్స్‌ అండ్‌ ఆబ్జెక్షన్స్‌ పరిష్కారానికి అక్టోబర్‌ 15వరకు గడువు విధించారు.

పారదర్శకమైన జాబితానే లక్ష్యం

అర్హులైన ప్రతి పౌరుడు తమ పేరు ముసాయిదా ఓటరు జాబితాలో ఉందో లేదో పరిశీలించుకోవాలి. పేరు లేకపోతే వివరాల్లో ఏవైనా తప్పులు ఉంటే నిర్ణీత గడువులో సంబంధిత ఫారాల ద్వారా క్లెయిమ్‌, ఆబ్జెక్షన్‌ దాఖలు చేయాలి. అర్హుత కలిగిన ప్రతి ఒక్క ఓటరు జాబితా నుంచి మిగిలిపోకుండా పారదర్శకమైన జాబితా రూపకల్పనకు కృషి చేస్తున్నాం. ఇందుకు రాజకీయ పార్టీలే కాకుండా ఓటర్లంతా సహకరించాలి.

– తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌, జిల్లా కలెక్టర్‌

మొత్తం ఓటర్లు 9,11,945 మంది

అభ్యంతరాలకు నెలరోజుల గడువు

అక్టోబర్‌ 19న తుది ఓటరు జాబితా

నియోజకవర్గాల వారీగా ఓటర్లు

నియోజకవర్గం పోలింగ్‌కేంద్రాలు పురుషులు మహిళలు ఇతరులు మొత్తం

హుజూర్‌నగర్‌ 311 1,10,766 1,16,618 14 2,27,398

కోదాడ 296 1,08,036 1,13,829 14 2,21,879

సూర్యాపేట 278 1,07,563 1,12,757 15 2,20,335

తుంగతుర్తి 327 1,20,725 1,21,602 06 2,42,333

మొత్తం 1,212 4,47,090 4,64,806 49 9,11,945

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement