మేళ్లచెరువు : మండల కేంద్రంలోని శ్రీఇష్టకామేశ్వరీ సమేత శ్రీస్వయంభు శంభులింగేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివలింగాన్ని పుష్పాలతో అలంకరించి గంధంతో పూజించారు. స్వామివారికి గణపతిపూజ, పుణ్యాహవచనం, మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, సహస్రనామార్చన, మహాలింగార్చన, అనంతరం గోపూజ నిర్వహించారు. మధ్యాహ్నం అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈఓ శంభిరెడ్డి అర్చకులు విష్ణువర్ధన్‌శర్మ, ధనుంజయశర్మ పాల్గొన్నారు.
బాధితులకు
అండగా ఉంటాం : ఎస్పీ
సూర్యాపేటటౌన్ : బాధితులకు అండగా ఉంటూ వారికి న్యాయం జరిగేలా చూస్తామని ఎస్పీ నరసింహ అన్నారు. సూర్యాపేటలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీస్ గ్రీవెన్స్ డే కార్యక్రమంలో ఎస్పీ నరసింహ ఫిర్యాదుదారుల నుంచి వినతులు స్వీకరించారు. ఫిర్యాదుదారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతిఒక్క బాధితుడి సమస్యను విని, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకునేలా సంబంధిత పోలీస్ అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు త్వరితగతిన న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి బాధితులకు భరోసా కల్పిస్తామని హామీ ఇచ్చారు.
చిన్నారులకు సకాలంలో టీకాలు వేయాలి
అర్వపల్లి : చిన్న పిల్లలకు సకాలంలో టీకాలను వేయాలని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ కోటిరత్నం వైద్య సిబ్బందికి సూచించారు. అర్వపల్లి పీహెచ్‌సీని సోమవారం ఆమె సందర్శించి రికార్డులు పరిశీలించారు. చిన్నారుల టీకాల కార్యక్రమంపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సకాలంలో టీకాలు వేస్తే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు. టీకాలు ఇవ్వడం వల్ల వారిలో వ్యాధి నిరోధక శక్తి పెరిగి వ్యాధుల బారిన పడకుండా ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి డాక్టర్ బి.నగేష్‌నాయక్, వీసీసీఎం లతీఫ్, సూపర్‌వైజర్ లలిత, నర్సింగ్ ఆఫీర్ మాధవి, ఫార్మసిస్టు అనూష, హెల్త్ అసిస్టెంట్లు సైదమ్మ, దుర్గమ్మ, సిబ్బంది పాల్గొన్నారు.
ప్రజావాణి పక్కాగా నిర్వహించాలి
చివ్వెంల(సూర్యాపేట) : మండల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమాన్ని అధికారులు సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా పరిషత్ సీఈఓ శిరీష అన్నారు. సోమవారం చివ్వెంల మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమాన్ని ఆమె తనిఖీ చేసి మాట్లాడారు. గ్రామాల ప్రజలు తమ సమస్యలను ప్రతి సోమవారం ప్రజావాణిలో అధికారులకు విన్నవించుకోవాలన్నారు. మొదటి రోజు 5 దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ జి.చంద్రశేఖర్, ఎంపీడీఓ సంతోష్ కుమార్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.


