సరికొత్తగా కొత్తగూడెం మేజర్‌ | - | Sakshi
Sakshi News home page

సరికొత్తగా కొత్తగూడెం మేజర్‌

Jul 23 2026 2:00 AM | Updated on Jul 23 2026 2:00 AM

ఆధునీకరణకు రూ.39.57 కోట్లు

మంజూరైన నిధులతో పూడికతీత,

వంతెనల నిర్మాణం

కాల్వ కట్ట మరమ్మతు, సీసీ లైనింగ్‌

ఆనందంలో ఆయకట్టు రైతులు

నడిగూడెం : నడిగూడెం మండల పరిధిలోని నాగార్జునసాగర్‌ ఎడమ కాల్వకు అనుబందంగా ఉన్న కొత్తగూడెం మేజర్‌ (14–ఏ) కాల్వ ఆధునీకరణకు ప్రభుత్వం ఇటీవల రూ.39.57 కోట్లు మంజూరు చేసింది. ప్రస్తుతం పనులు టెండర్ల దశలో ఉన్నాయి. టెండర్లు పూర్తి కాగానే పనులు ప్రారంభం కానున్నాయి. దీంతో కాల్వ రూపురేఖలు మారడంతోపాటు చివరి ఆయకట్టుకు సాగు నీరందనుంది.

కాల్వ పొడవు 26.81 కిలోమీటర్లు

నాగార్జునసాగర్‌ ఎడమ కాల్వకు అనుబంధంగా చాకిరాల గ్రామంలోని 123.450 కిలోమీటర్‌ వద్ద ప్రారంభమైన కొత్తగూడెం మేజర్‌ చాకిరాల, శ్రీరంగాపురం, రత్నవరం, వాయిలసింగారం, వసంతాపురం, గోల్‌తండా, అనంతగిరి, శాంతినగర్‌, గోండ్రియాల గ్రామాల మీదుగా కోదాడ మండలం మంగళితండా వరకు 26.81 కిలోమీటర్ల పొడవు ఉంది. చాలా ఏళ్ల క్రితం తవ్విన కాల్వను సామర్థ్యం 270 క్యూసెక్కుల నీరు కాగా దీని ఆయకట్టు 16,896 ఎకరాలుగా ఉంది.

బలహీనంగా మేజర్‌ కాల్వ కట్ట

కొత్తగూడెం మేజర్‌ కాల్వ కట్ట అనేక చోట్ల బలహీనంగా మారింది. పలుచోట్ల కాల్వలో నాచు పెరిగి మట్టితో పూడింది. చాలాచోట్ల కాల్వ కట్టలకు ఇరువైపులా కంపచెట్లు పెరిగి అధ్వానంగా మారాయి. రత్నవరం, వాయిలసింగారం గ్రామాల వద్ద ఉన్న వంతెనలు పూర్తిగా దెబ్బతిన్నాయి. శ్రీరంగాపురం, రత్నవరం, వాయిలసింగారం వద్ద యూటీలు కూడా దెబ్బతిన్నాయి. రత్నవరం, శ్రీరంగాపురం గ్రామాల వద్ద ఉన్న యూటీలకు నిత్యం గండ్లు పడుతున్నాయి. నీటి ప్రవాహం ఎక్కువైతే కాల్వ కట్టపై నీరు పొంగిపొర్లుతుంది. దీంతో వందల ఎకరాల్లో పొలాలు నీట మునిగే పరిస్థితులు నెలకొంటున్నాయి. ఎట్టకేలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో కాల్వకు మహర్దశ పట్టనుంది.

చేపట్టబోయే పనులు ఇవే..

మంజూరైన నిధులతో కాల్వలో పూడికలు తీసి కట్టకు ఇరువైపులా ఉన్న కంపచెట్లు తొలగిస్తారు. కాల్వ కట్టకు కూడా మరమ్మతులు చేయనున్నారు. అలాగే కాల్వలో గచ్చువేసి సీసీ లైనింగ్‌ నిర్మించనున్నారు. శ్రీరంగాపురం, రత్నవరం, వాయిలసింగారం గ్రామాల సమీపాన ఉన్న యూటీలను పూర్తిగా తొలగించి, కొత్తగా నిర్మించనున్నారు. రత్నవరం, వాయిలసింగారం గ్రామాల వద్ద శిథిలావస్థకు చేరిన వంతెనలను పూర్తిగా తొలగించి, కొత్తవి నిర్మించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. వీటితోపాటు కొత్తగూడెం మేజర్‌కు పలుచోట్ల అనుబంధంగా ఉన్న మైనర్‌ కాల్వల్లో పూడికలు తీసి, కంపచెట్లు తొలగించనున్నారు. మేజర్‌ నిర్మాణ సమయంలో ఏ డిజైన్‌ చేస్తారో అదేవిధంగా మైనర్లను కూడా మరమ్మతులు చేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement