తనిఖీలు ఏమైనట్టు..!
మొన్న విత్తనాలు.. నేడు ఎరువులు కల్తీ
ఫ జోరుగా కల్తీ డీఏపీ అమ్మకాలు
ఫ కొరతను ఆసరా చేసుకుని
కల్తీ చేస్తున్న కేటుగాళ్లు
ఫ ప్రతి సీజన్‌లో నకిలీ
విత్తనాలతోనూ తంటాలే..
ఫ కట్టడి చేయడంలో
యంత్రాంగం విఫలం
ఫ తీవ్రంగా నష్టపోతున్న రైతాంగం
రైతులు లైసెన్స్ పొందిన డీలర్ల వద్దని ఎరువులు, విత్తనాలు, పురుగుల మందులను కొనుగోలు చేయాలి. కొనుగోలు చేసిన ప్రతి దానికి రసీదులను తీసుకొని భద్రపరుచుకోవాలి. ప్రభుత్వం నకిలీలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటుంది. రైతులు అప్రమత్తంగా ఉండి అధికారులకు సమాచారం అందించాలి.
– శ్రీధర్‌రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి
భానుపురి (సూర్యాపేట) : జిల్లా రైతాంగాన్ని నకిలీ బెడద వీడడం లేదు. విత్తనాలు నుంచి మొదలుకొని ఎరువుల వరకు నకిలీవి, కల్తీవి అమ్ముతున్న కొందరు వ్యాపారులు రైతులను నిండా ముంచుతున్నారు. ఇన్నాళ్లు పలు రకాల నకిలీ విత్తనాలను తయారు చేసిన మోసగాళ్లు.. ఇప్పుడు ఏకంగా ఎరువులను కల్తీ చేసి రైతులకు అంటగడుతూ చివరకు నష్టాల పాలు చేస్తున్నారు. దీంతో రైతులు సాగు నిమిత్తం ఏది కొనాలన్నా.. ఇది కల్తీనా..! అసలుదా.. పసిగట్టేది ఎలా అని తలలు పట్టుకుంటున్నారు. అసలే ఎల్‌నినో పరిస్థితుల్లో సాగు పనులు ముందుకు సాగక అవస్థలు పడుతుండగా.. నకిలీ ఎరువుల తయారీ గాళ్ల సమస్య వచ్చి పడింది. జిల్లాలో ఇటీవల నకిలీ డీఏపీ గుట్టురట్టు కాగా.. అదే నకిలీ డీఏపీని చాలామంది రైతులు కొనుగోలు చేసినట్లు సమాచారం.
నకిలీ విత్తనాలతో ఇబ్బందులు
జిల్లా వ్యాప్తంగా ఏటా సుమారు ఆరు లక్షల ఎకరాల్లో వివిధ పంటల సాగు జరుగుతుంటాయి. ఇందులో అత్యధికంగా 4.90లక్షల ఎకరాల వరకు వరి సాగు ఉంటుంది. మరో 90 వేల ఎకరాల వరకు పత్తి సాగు అవుతుంది. అయితే నకిలీ విత్తనాలు అని తెలియక కొని సాగు చేశాక పూత, పిందె రాకుండా చెట్టు కేవలం ఎదిగి దిగుబడులు లేక రైతులు నష్టపోయిన సంఘటనలు ఉన్నాయి. రెండేళ్లుగా జిల్లాలోని పలుచోట్ల నకిలీ పత్తి విత్తనాల ప్యాకెట్లను పోలీసులు సైతం పట్టుకున్నారు.
అదును చూసి ఎరువులను కల్తీ..
గత ఏడాది నుంచి జిల్లాలో ఎరువుల కొరత నెలకొని ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పలు యుద్ధాలతో నెలకొన్న ఈ పరిస్థితుల్లో రైతులు ఎరువుల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యూరియా కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా యాప్‌ని రూపొందించగా కాంప్లెక్స్ ఎరువులను నేరుగా ఫర్టిలైజర్ దుకాణాల్లో కొనుగోలు చేయాల్సి ఉంది అయితే ఈ కాంప్లెక్స్ ఎరువులు కూడా ఈ వానాకాలం సీజన్లో కొంతమేర కొరత ఏర్పడింది. ప్రధానంగా జిల్లాలో డీఏపీ, 20–20–0–13 తదితర రకాల వాడకం అధికంగా ఉంటుంది. వీటి సరఫరా అంతగా లేకపోవడంతో రైతులు ఎక్కడ డీఏపీ ఉన్నా వెళ్లి తెచ్చుకుంటున్నారు. ఇదే అదునుగా నకిలీ డీఏపీ తయారీకి ఓ ముఠా హైదరాబాద్ శివారులో అడ్డా ఏర్పరచుకుంది. ఇక్కడ నకిలీ డీఏపీ తయారు చేసి నేరుగా గ్రామీణ ప్రాంతాలకు తీసుకెళ్లి విక్రయించారు. ప్రస్తుతం కొరత ఉండడంతో రైతులు మీద మీద పడి ఈ నకిలీ డీఏపీని కొనుగోలు చేశారు.
రాజధాని శివారు నుంచి జిల్లాలోని ఓ మారుమూరు పల్లె వరకు నకిలీ డీఏపీని తీసుకెళ్లి విక్రయించినా అధికారులు పట్టుకోలేకపోవడం గమనార్హం. సీజన్ ప్రారంభాని కంటే ముందు నుంచే నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందుల విక్రయాలపై కన్నేసి ఉంచేందుకు టాస్క్ ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. నిరంతరం తనిఖీలు చేస్తూ నకిలీలను గుర్తించుంటారు. అయితే రాజధాని నుంచి మార్మూలల వరకు డీఏపీ రవాణా కావడమే కాకుండా చాలామంది రైతులకు సరఫరా చేసిన వరకు తనిఖీలు లేకపోవడంతో రైతులు ఈ టాస్క్ ఫోర్స్ కమిటీల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు నిరంతరం నకిలీ తయారీగాళ్లపై నిగా ఉంచాలని, జిల్లా రైతాంగం వీరి బారిన పడకుండా చూడాలని కోరుతున్నారు.


