డ్రైవర్లకు కంటిచూపు బాగుండాలి
సూర్యాపేట టౌన్ : డ్రైవింగ్ వృత్తిలో కంటిచూపు చాలా కీలకమైందని, డ్రైవర్లకు కంటిచూపు బాగుంటేనే వాహనాలు ప్రమాదాలకు గురికాకుండా నడపగలుగుతారని ఎస్పీ నరసింహ అన్నారు. అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా సూర్యాపేట పట్టణ పోలీసుల ఆధ్వర్యంలో శనివారం జిల్లా కేంద్రంలో వివిధ రకాల వాహనాల డ్రైవర్లకు నిర్వహించిన ఉచిత కంటి పరీక్షల వైద్య శిబిరాన్ని ఎస్పీ ప్రారంభించి మాట్లాడారు. ముందు జాగ్రత్తలు పాటించడంతోనే రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చన్నారు. మనదేశంలో ఏడాదికి సుమారు 1.5 లక్షల మంది, తెలంగాణలో 7,500 మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారని తెలిపారు. జిల్లాలో 2024లో 278 మంది రోడ్డు ప్రమాదాలలో మరణించగా 2025లో జిల్లా పోలీస్ శాఖ తీసుకున్న పటిష్ట చర్యల వల్ల మరణాలు 58కి తగ్గించగలిగామని పేర్కొన్నారు. డ్రైవర్ వృత్తి చాలా కష్టతరమైనదని, ఈ వృత్తిని ఎంచుకొని నిర్విరామంగా కష్టపడుతున్న డ్రైవర్లు తమ ఆరోగ్యాలను కూడా కాపాడుకోవాలన్నారు. సామాజిక సేవగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో డ్రైవర్లకు కంటి వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. స్థానిక లయన్స్ క్లబ్, గ్లోబల్ కంటి ఆసుపత్రి డాక్టర్ల సహకారంతో నిర్వహించిన ఈ శిబిరంలో 500 మందికిపైగా డ్రైవర్లకు కంటి పరీ క్షలు చేయించామన్నారు. రోడ్డు భద్రత నిబంధనలు పాలించాలని డ్రైవర్లచే ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో డీఎస్పీ ప్రసన్నకుమార్, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు దోసపాటి గోపాల్, కార్యదర్శి రాజేంద్ర ప్రసాద్, పట్టణ సీఐ వెంకటయ్య, సీఐలు రాజశేఖర్, నరసింహారావు, నాగేశ్వరరావు, ట్రాఫిక్ ఎస్‌ఐ సాయిరాం పాల్గొన్నారు.
ఫ ఎస్పీ నరసింహ


