ముగిసిన సీఎం కప్ ఖోఖో పోటీలు
నల్లగొండ టూ టౌన్ : నల్లగొండ జిల్లా కేంద్రంలో గత నాలుగు రోజులుగా జరుగుతున్న సీఎం కప్ రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలు సోమవారంతో ముగిశాయి. చివరి రోజు పోటీలు హోరాహోరీగా జరిగాయి. బాలుర విభాగంలో ఆదిలాబాద్ జిల్లా జట్టు, బాలికల విభాగంలో ఆసిఫాబాద్ జిల్లా జట్టు విజేతలుగా నిలిచాయి. బాలికల విభాగంలో నల్ల గొండ జట్టు ద్వితీయ బహుమతి, బాలుర విభాగంలో మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా జట్టు ద్వితీయ బహుమతులు కై వసం చేసుకున్నాయి. ముగింపు కార్యక్రమానికి నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్‌రెడ్డి ముఖ్యఅతిథిగా మాట్లాడారు. 33 జిల్లాల నుంచి 450 మంది బాలికలు, 450 మంది బాలురు ఈ ఖోఖో పోటీల్లో పాల్గొనడం అభినందనీయమన్నారు. సీఎం కప్ క్రీడాపోటీలతో గ్రామీణ క్రీడాకారులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. అనంతరం విజేతలకు మేయర్ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అష్రఫ్ అలీ, జిల్లా గ్రంథాలయ చైర్మన్ హఫీజ్‌ఖాన్, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, తెలంగాణ ఖోఖో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి, డీవైఎస్‌ఓ అక్బర్ అలీ తదితరులు పాల్గొన్నారు.
బాలుర విభాగంలో విజేతగా
ఆదిలాబాద్ జట్టు
బాలికల విభాగంలో ఆసిఫాబాద్
జట్టుకు ప్రథమ బహుమతి


