తైక్వాండో పోటీల్లో బంగారు పతకం
రామగిరి(నల్లగొండ) : హైదరాబాద్ గచ్చి బౌలి స్టేడియంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి తైక్వాండో అండర్–17 విభాగం పోటీల్లో ఎన్జీ కళాశాలకు చెందిన ఎన్.మనోజ్‌యాదవ్ ఉత్తమ ప్రతిభ కనబరిచి బంగారు పతకం సాధించాడు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్ సోమవారం మనోజ్‌యాదవ్‌ను అభినందించారు. కార్యక్రమంలో ఫిజికల్ సైన్స్ ఇన్‌చార్జ్ డాక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, నర్సింగ్ కోటయ్య, వెంకటేశ్, మన్నెం వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.
దొంగతనం కేసులో ఏడు నెలల జైలుశిక్ష
నకిరేకల్ : దొంగతనం కేసులో నిందితుడికి ఏడు నెలల జైలుశిక్ష విధిస్తూ నకిరేకల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్‌కే ఆరిఫ్ సోమవారం తీర్పు వెలువరించారు. నకిరేకల్ పట్టణంలోని విద్యానగర్‌లో నివాసముంటున్న ఎస్‌కే జాఫర్ ఇంట్లో దొంగతనానికి పాల్పడిన రమావత్ శంకర్‌నాయక్‌పై నేరం రుజువు కావడంతో అతడికి ఏడు నెలల జైలుశిక్షతో పాటు రూ.500 జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు వెలువరించారని నకిరేకల్ సీఐ హరిబాబు పేర్కొన్నారు.
సాగర్ కాలువలో పడి వ్యక్తి మృతి
తిరుమలగిరి(సాగర్): నాగార్జునసాగర్ ఎడమ కాల్వ మొదటి మేజర్ అయిన రాజవరం మేజర్ కాలువలో ప్రమాదవశాత్తు కాలుజారి పడి వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన సోమవారం రాత్రి జరిగింది. వివరాలు.. అల్వాల గ్రామానికి చెందిన బక్కతట్ల వెంకటేశ్వర్లు(38)తో పాటు అతడి బావ, మామ రాజవరం మేజర్ కాలువ వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో కాలువ వద్దకు మూత్ర విసర్జనకు వెళ్లిన వెంకటేశ్వర్లు కాలు జారి ఒక్కసారిగా కాలువలో పడిపోయాడు. అతని బావ, మామకు ఈత రాకపోవడంతో చుట్టుపక్కల వారిని పిలుచుకొచ్చి వెంకటేశ్వర్లును కాలువ నుంచి బయటకు తీసి చికిత్స నిమిత్తం హాలియాకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. దీంతో పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని సాగర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.


