పేదలకు గృహలక్ష్మి యోగం
ప్రభుత్వ జీఓ మేరకు ముందుకు
గృహలక్ష్మి లబ్ధిదారులకూ ఆర్థిక సాయం
నిబంధనలు ఇలా..
భానుపురి (సూర్యాపేట) : గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ జాగా ఉన్న నిరుపేదలు ఇల్లు నిర్మించుకునేందుకు రూ.3లక్షల ఆర్ధిక సాయం అందించేలా గృహలక్ష్మి పథకాన్ని ప్రారంభించింది. అయితే పథకం ప్రారంభించిన కొద్దిరోజులకే ప్రభుత్వం మారడంతో లబ్ధిదారులు ప్రయోజనం పొందలేక పోయారు. అటువంటి వారికి కూడా ఇందిరమ్మ ఇళ్ల కింద ప్రయోజనం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం అధికారులు లబ్ధిదారులను గుర్తించే పనుల్లో ఉన్నారు.
బేస్‌మెంట్ లెవల్‌లోనే..
గత ప్రభుత్వం జాగా ఉండి ఇల్లు నిర్మించుకునే ఆర్థిక స్థోమత లేని పేదలకు గృహలక్ష్మి పథకం ద్వారా రూ.3లక్షలు అందిస్తామని ప్రకటించింది. ఇందుకు గానూ లబ్ధిదారులను ఎంపిక చేసింది. చాలా మంది ఇంటి నిర్మాణాలను ప్రారంభించారు. అయితే ప్రభుత్వం మారడంతో ఈ పథకం నిలిచి పోయింది. ఈ పథకం కింద ఇల్లు మంజూరై, పనులు ప్రారంభించిన లబ్ధిదారులు ఇబ్బంది పడకుండా ప్రస్తుత ప్రభుత్వం వారికి శుభవార్త అందించింది. బేస్‌మెంట్ దశ దాటి నిలిచిపోయిన ఇళ్లను పరిగణనలోకి తీసుకుంటూ మిగతా పనులు కొనసాగించేందుకు లబ్ధిదారులకు రూ.4 లక్షలు విడతల వారీగా అందించేలా ప్రభుత్వం జీఓ జారీ చేసింది. వీటిని ఇందిరమ్మ ఇళ్లుగా పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొంది.
నియోజకవర్గానికి 3వేల చొప్పున
సొంత స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణం కోసం రూ.3లక్షల ఆర్థిక సాయం అందించేలా 2023లో శాసనసభ ఎన్నికలకు నాలుగు నెలల ముందు అప్పటి ప్రభుత్వం గృహలక్ష్మి పథకాన్ని ప్రకటించింది. దాంతో పెద్ద ఎత్తున నిరుపేదలు దరఖాస్తు చేసుకోగా.. నియోజకవర్గానికి 3వేల చొప్పున ఇళ్లను ప్రకటించి లబ్ధిదారులను సైతం ఎంపిక చేసి మంజూరు పత్రాలను అందించిది. కొందరు నిర్మాణ పనులు చేపట్టగా.. ఇంకా కొందరు ఇళ్లు నిర్మించుకోవాలా..? వద్దా..? అన్న మీమాసంలో పడ్డారు. ఈ క్రమంలోనే ఎన్నికల కోడ్ కావడం, ప్రభుత్వం మారిపోవడంతో ఇళ్లు ప్రారంభించిన లబ్ధిదారులు వాటిని కొనసాగించలేక పోయారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గృహలక్ష్మి పథకాన్ని రద్దు చేసి ఇందిరమ్మ ఇళ్లను ప్రకటించి వాటి అమలుకు శ్రీకారం చుట్టింది. తాజాగా గృహలక్ష్మి లబ్ధిదారులను సైతం ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో చేరుస్తున్నట్లు ప్రకటించింది.
ప్రభుత్వం ఇటీవల జీఓ ఆర్టీ 936 తీసుకొచ్చింది. ఈ జీఓ మార్గదర్శకాల మేరకు ఉన్నవారిని గుర్తిస్తాం. జిల్లాలో ఈ విధంగా ఉన్న లబ్ధిదారులు ఎవరూ ఉండకపోవచ్చు.
–సిద్ధార్థనాయక్, హౌసింగ్ పీడీ
ఫ ఇందిరమ్మ ఇళ్లుగా పరిగణనలోకి
తీసుకోనున్న ప్రభుత్వం
ఫ బేస్‌మెంట్ స్థాయిలో
నిలిచిన వాటికి వర్తింపు
ఫ లబ్ధిదారుల గుర్తింపు పనిలో అధికారులు
అప్పట్లో మంజూరైన గృహలక్ష్మి ఇల్లు ప్రారంభించిన లబ్ధిదారులు మొదటగా సొంత ఖర్చుతో కొంత మేర నిర్మించుకున్నారు. ఎలాంటి నిబంధనలు లేకపోవడంతో ఇష్టానుసారంగా స్థామతను బట్టి నిర్మాణాలు చేపట్టారు. అయితే ఇందిరమ్మ ఇళ్ల మార్గదర్శకాలు మాత్రం వేరుగా ఉన్నాయి. గృహలక్ష్మి పథకంలో నిలిచిన ఇళ్లు కూడా 400 నుంచి 600 చదరపు అడుగుల మధ్యలోనే ఉండాలి. బేస్‌మెంట్‌ను ఆ రకంగా పునరుద్ధరించుకోవాలి. బేస్‌మెంట్ నిర్మించుకున్నందున దశలవారీగా రూ.4 లక్షలు అందిస్తారు.(రూ్‌ఫ్‌స్థాయి రూ.లక్ష, స్లాబ్ పూర్తయితే రూ.లక్ష పనులు పూర్తయ్యాక రూ. 2 లక్షలు)


