నేటి నుంచి ప్రజావాణి
భానుపురి (సూర్యాపేట) : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నిలిపివేసిన ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ నెల 23 నుంచి యథావిధిగా కొనసాగిస్తామని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ప్రజలు, దరఖాస్తుదారుల నుంచి వినతులు స్వీకరించి పరిష్కరించనున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించి సద్విని యోగం చేసుకోవాలని కోరారు.
సూర్యక్షేత్రంలో సౌరహోమం
అర్వపల్లి : జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురంలోని అఖండజ్యోతి స్వరూప సూర్యనారాయణస్వామి క్షేత్రంలో ఆదివారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారు జామున ఉషాపద్మిని ఛాయాసమేత సూర్యనారాయణస్వామిని ప్రత్యేకంగా అలంకరించి అభిషేకాలు జరిపారు. యజ్ఞశాలలో మహా సౌరహోమం నిర్వహించారు. క్షేత్ర ఆవరణలోని కార్యసిద్ధి వీరహనుమాన్, రామకోటి స్తూపాలను భక్తులు దర్శించుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కార్యక్రమంలో క్షేత్ర వ్యవస్థాపకులు కాకులారపు రజితాజనార్ధన్, గణపురం నరేష్, ఇంద్రారెడ్డి, యాదగిరి, అర్చకులు భీంపాండే, అంకిత్‌పాండే, శ్రీరాంపాండే పాల్గొన్నారు.
లక్ష్మీనరసింహుడికి
విశేష పూజలు
మఠంపల్లి : మట్టపల్లి క్షేత్రంలో ఆదివారం స్వామివారికి అర్చకులు విశేష పూజలు చేశారు. ఈ సందర్భంగా లక్ష్మీనరసింహస్వామికి సుప్రభాతసేవ, హోమశాలలో నిత్యఅగ్నిహోత్రి, మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం చేపట్టారు. అనంతరం గోదాదేవికి, ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. లక్ష్మీనరసింహస్వామి, అమ్మవార్లలను పట్టు వస్త్రాలంకరణతో వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవం నిర్వహించారు. అనంతరం స్వామి, అమ్మవారి నిత్య కల్యాణాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా స్వామి వారికి నీరాజన మంత్ర పుష్పాలతో మహానివేదన చేశారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, చెన్నూరు విజయ్‌కుమార్, ఈఓ బి.జ్యోతి, అర్చకులు పాల్గొన్నారు.
యువత భవిష్యత్ కోసం ఉపాధ్యాయుడి ఆరాటం
సూర్యాపేటటౌన్ : యువత బంగారు భవిష్యత్ కోసం మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కోరుతూ ప్రభుత్వ ఉపాధ్యాయుడు, సామాజిక కార్యకర్త రాచకొండ ప్రభాకర్ ప్రతి ఆదివారం వివిధ రూపాలలో ప్రచారం నిర్వహిస్తున్నాడు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శంకర్‌విలాస్ సెంటర్, కూరగాయల మార్కెట్ రోడ్డులో ఆదివారం సాయంత్రం కోయదొర వేషధారణలో మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా, రోడ్డు భద్రతపై యువతకు అవగాహన కల్పించారు. గంజాయి, డ్రగ్గ్స్‌కు బానిసలై యువత భవిష్యత్ నాశనం చేసుకోవద్దని కోరారు
నేటి నుంచి ప్రజావాణి
నేటి నుంచి ప్రజావాణి


