26 నుంచి బ్రహ్మోత్సవాలు
మునగాల : రెండవ యాదగిరిగుట్టగా పేరున్న మునగాల మండలం రేపాల గ్రామంలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఈ నెల 26 నుంచి ప్రారంభం కానున్నాయి. పది రోజుల పాటు జరిగే ఉత్సవాలకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రకృతి నిలయంలో ఉన్న లక్ష్మీనరసింహుడి ఆలయ పరిసర ప్రాంతంలో విశాలమైన కల్యాణ మండపం, చింతచెట్లు, దగ్గరలో పెద్ద కోనేరు ఉండడం ఇక్కడి ప్రత్యేకత.
10రోజులపాటు ఉత్సవాలు
రాజ్యలక్ష్మీ సమేత లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 26 నుంచి మార్చి7 వరకు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ సారిక రామయ్యయాదవ్ తెలిపారు. పది రోజుల పాటు నిర్వహించే బ్రహ్మోత్సవాలలో మొదటి రోజు స్వామివారు సిరిపురం నుంచి ఆలయానికి రాక, 27న అధ్యయనోత్సవం, 28న పరమపదోత్సవం, మార్చి ఒకటో తేదీన ద్వజారోహణం(గరుడముద్ద), 2న సాయంత్రం 6 గంటలకు డోలోత్సవం, అదే రోజు రాత్రి 10 గంటలకు స్వామి వారి కల్యాణోత్సవం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. మార్చి 3న ఉదయం 10 గంటలకు లక్ష కుంకుమార్చన, 4న రాత్రి ఎనిమిది గంటలకు గరుడోత్సవం, రథోత్సవం, 5న ఉదయం చక్రతీర్ధం, రాత్రికి పూర్ణాహుతి, ధ్వజారోహణం, దోపు, 6న రాత్రి 10 గంటలకు గాంధోళి(వసంతోత్సవం), 7న రాత్రి 9గంటలకు స్వామి పవళింపు సేవ, రాత్రి 12 గంటలకు స్వామి వారు సిరిపురం వేంచేయడంతో ఉత్సవాలు పరిసమాప్తం అవుతాయన్నారు. ఉత్సవాలకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు చైర్మన్ తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని ఆయన కోరారు.
ఫ పది రోజుల పాటు రేపాల లక్ష్మీనరసింహ స్వామి ఆలయ ఉత్సవాలు
ఫ ఏర్పాట్లు చేస్తున్న ఆలయ కమిటీ


