ఉపాధి పనుల్లో పారదర్శకత తప్పనిసరి
మునగాల : ఉపాధి హామీ పనుల్లో పారదర్శకత పాటించాలని డీఆర్‌డీఓ డి.శీరీష అన్నారు. శుక్రవారం మునగాల ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో 2024–25 ఆర్థిక సంవత్సరంలో మండలంలో నిర్వహించిన ఉపాధిహామీ పనులపై నిర్వహించిన ఓపెన్‌ఫోరంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఉపాధి పనుల నిర్వాహణను పారదర్శకంగా పూర్తి చేయాలని, పనిగంటలు వృథాకాకుండా ప్రతి పేద కుటుంబానికి పని కల్పించాలని సూచించారు. కూలీలకు రోజువారి వేతనం అందేలా క్షేత్రస్థాయిలో ఉపాఽధిహామీ పథకం సిబ్బంది, ఫీల్డు అసిస్టెంట్లు చర్యలు తీసుకోవాలని సూచించారు. అవినీతి, అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సందర్భంగా గ్రామాల వారీగా రెండు సంవత్సరాలుగా చేసిన పనులకు సంబంధించిన ఆడిట్ సిబ్బంది నివేదికలను ఓపెన్‌ఫోరంలో చదివి వినిపించారు. ఈ నివేదికపై సమావేశంలో చర్చించి ఖర్చుల్లో తేడా ఉన్న రూ.74,950 రికవరీ చేయాలని, రూ.11వేలు జరిమానా చెల్లించాలని ఆయా గ్రామాల ఫీల్డు అసిస్టెంట్లకు ఆదేశించారు. కార్యక్రమంలో ఏపీడీలు పవన్‌కుమార్, యామిని, అంబుడ్స్‌మెన్ లచ్చిరామ్‌నాయిక్, ఏవీఓ ఆశాలత, ఎంపీడీఓ రమేష్‌దీనదయాళ్, ఎంపీఓ నరేష్, ఏపీఓ శైలజ, పలు గ్రామాల సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.


