ప్రభుత్వ కళాశాలల్లో నాణ్యమైన విద్య
నేరేడుచర్ల : ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నాణ్యతతో కూడిన విద్యాబోధన ఉంటుందని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారి భానుప్రకాశ్ అన్నారు. గురువారం నేరేడుచర్లలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల వార్షికోత్సవం, వీడ్కోలు సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ కళాశాలల్లో అన్ని వసతులు, సౌకర్యాలు ఉన్నాయని, ఉచితంగా పుస్తకాలు కూడా అందిస్తూ ప్రభుత్వం విద్యను ప్రోత్సహిస్తోందన్నారు. పిల్లల తల్లిదండ్రులు విద్యార్థులను ప్రతి రోజు కళాశాలలకు పంపించేలా చర్యలు తీసుకోవాలన్నారు. గత విద్యా సంవత్సరం ఉత్తమ ఫలితాలు సాధించామని, ఈ విద్యాసంవత్సరం కూడా అత్యుత్తమ ఫలితాలు సాధించేందుకు అధ్యాపకులు కృషి చేయాలన్నారు. అడ్మిషన్లు మరింత పెంచాలన్నారు. ఇటీవల కళాశాలలో నిర్వహించిన టాలెంట్ టెస్టుల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచిన గరిడేపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థి బ్రహ్మచారికి రూ.2016, ద్వితీయ బహుమతి పొందిన శ్రీవాణి, పినాకిల్ పాఠశాల విద్యార్థులకు రూ.1016, తృతీయ బహుమతి జెడ్పీ ఉన్నత పాఠశాల నేరేడుచర్ల విద్యార్థులకు రూ.516 చొప్పున బహుమతులు అందించారు. కళాశాల ప్రిన్సిపాల్ వెంకటరమణ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో మండల విద్యాధికారి సత్యనారాయణరెడ్డి, ఎస్‌ఐ రవీందర్‌నాయక్, ఆయా పాఠశాలల ఇన్‌చార్జ్ ఉపాధ్యాయులు సత్యనారాయణ, కోటేశ్వర్‌రావు, హరికృష్ణ, జగదీష్, శ్రవణ్‌కుమార్, సూపరింటెండెంట్ నర్సింహ, కళాశాల అధ్యాపకులు డాక్టర్ మద్దిమడుగు సైదులు, ప్రణతి, కేఎల్‌ఎన్‌రావు ఉన్నారు.
ఫ ఇంటర్మీడియట్
విద్యాశాఖాధికారి భానుప్రకాశ్


