అంత్యక్రియలకు వస్తూ అనంతలోకాలకు..
ఆలేరురూరల్: అంత్యక్రియలకు వస్తూ క్వాలిస్ వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో ఇద్దరు మృతిచెందారు. మరో ఏడుగురికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన వరంగల్–హైదరాబాద్ జాతీయ రహదారిపై ఆలేరు మండలం కందిగడ్డతండా శివారులో సోమవారం ఉదయం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆలేరు మండలం తూర్పుగూడెం గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ తన కుటుంబ సభ్యులతో కలిసి తమిళనాడు రాజధాని చైన్నెలో ఉంటున్నాడు. ఆయన భార్య రాములమ్మ అనారోగ్యంతో ఆదివారం మృతిచెందింది. రాములమ్మ అంత్యక్రియలు స్వగ్రామం తూర్పుగూడెంలో చేసేందుకు గాను ముందుగా మృతదేహాన్ని అంబులెన్స్‌లో చైన్నె నుంచి ఇక్కడికి పంపించారు. అనంతరం లక్ష్మీనారాయణ తన కుటంబ సభ్యులతో కలిసి చైన్నె నుంచి రైలులో బయల్దేరి సోమవారం ఉదయం వరంగల్ రైల్వే స్టేషన్‌లో దిగారు. వరంగల్ నుంచి క్వాలిస్ వాహనంలో తూర్పుగూడేనికి వస్తుండగా.. ఆలేరు మండలం కందిగడ్డతండా గ్రామ శివారులో క్వాలిస్ వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టుకు ఢీకొని బోల్తా పడింది. దీంతో క్వాలిస్‌లో ప్రయాణిస్తున్న మల్లిక(55), లక్ష్మీనారాయణ అత్త లక్ష్మమ్మ(88) ఇద్దరు మృతిచెందారు. మరో ఏడుగురు సత్యనారాయణ, లలిత, ప్రియదర్శిని, బాలాజీ, యశోద, సాయితరుణ్, డ్రైవర్ వంశీకి స్వల్ప గాయాలయ్యాయి. మృతురాలు మల్లిక చైన్నెలో లక్ష్మీనారాయణ నివాసముంటున్న ఇంటి పక్కన ఉంటున్నట్లు తెలిసింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ఆలేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి కుమారుడు మణిచంద్ర ప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ యాలాద్రి తెలిపారు.
అదుపుతప్పి చెట్టును ఢీకొట్టిన క్వాలిస్ వాహనం
ఇద్దరు మృతి
మరో ఏడుగురికి స్వల్ప గాయాలు


