దొంగతనం కేసులో ఇద్దరు అరెస్టు
కేతేపల్లి: దొంగతనం కేసులో ఇద్దరు నిందితులను కేతేపల్లి పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం శాలిగౌరారం సీఐ కొండల్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కేతేపల్లి మండల కేంద్రానికి చెందిన పసల కరుణ గత నెల 12న ఇంటికి తాళం వేసి పిల్లలతో కలిసి గజ్వేల్‌లో ఉంటున్న తన భర్త సునీల్‌కుమార్ దగ్గరకు వెళ్లింది. తిరిగి గత నెల 19న ఇంటికి వచ్చి చూసేసరికి తాళం పగులగొట్టి ఉండటంతో లోపలికి వెళ్లి చూడగా రూ.3లక్షల నగదు, బంగారు, వెండి ఆభరణాలు చోరీకి గురైనట్లు గుర్తించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేతేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా కేతేపల్లి మండలం చీకటిగూడెం వద్ద అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా కరుణ ఇంట్లో చోరీకి పాల్పడింది తామేనని నిజం అంగీకరించారు. నిందితులు ఏపీలోని నంద్యాల టౌన్‌కు చెందిన షేక్ మహబూబ్ పాష, ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లకు చెందిన కుప్పాల నాగవెంకటతిరుపతిరావుగా గుర్తించామని సీఐ తెలిపారు. వీరిద్దరితో పాటు రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం అనాజ్‌పూర్‌కు చెందిన బండారి శివ కలిసి చెడు అలవాట్లకు బానిసై దొంగతనాలు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు. వీరు చోరీ చేసిన డబ్బులతో గంజాయి వ్యాపారం కూడా చేస్తున్నట్లు తెలిపారు. కరుణ ఇంట్లో చోరీ చేసిన డబ్బును సమానంగా పంచుకుని ఎవరి ఇంటికి వారు వెళ్లిపోయారని, సోమవారం బంగారు ఆభరణాలు అమ్మేందుకు హైదరాబాద్‌లో ఉంటున్న బండారు శివ వద్దకు మహబూబ్ షాష, నాగవెంకట తిరుపతిరావు బయల్దేరగా.. అరెస్టు చేసినట్లు సీఐ వివరించారు. వారి ఆరు గ్రాముల బంగారు ఆభరణాలు, రెండు గ్రాముల వెండి ఆభరాణాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.


