ఎమ్మార్సీ భవనమా.. వైకుంఠధామమా?
ఇబ్బంది పడుతున్న ఉద్యోగులు
అనంతగిరి: ఇక్కడ కనిపిస్తున్నది అనంతగిరి మండల కేంద్రంలోని వైకుంఠధామం ఆర్చి. ఎమార్సీ (మండల విద్యా వనరుల కేంద్రం) భవనం ఎదుటే ఆర్చిని నిర్మించడం ప్రజలను గందరగోళానికి గురిచేస్తోంది. ఇది ఎమ్మార్సీ భవనమా, లేక వైకుంఠధామమా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి గ్రామంలో వైకుంఠధామం నిర్మించాలనే సంకల్పించిన గత ప్రభుత్వం.. అనంతగిరిలోని ఎన్‌టీఆర్ చౌరస్తాకు సమీపంలో సర్వే నంబర్ 1470లో వైకుంఠధామం నిర్మించింది. దీనికి ఆర్చి నిర్మించి, గేట్ కూడా ఏర్పాటు చేశారు. మండల అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వం ఎమ్మార్సీకి భవనం మంజూరు చేసింది. కాగా భవనాన్ని అదే సర్వే నంబర్‌లోని కొంత స్థలంలో నిర్మించారు. అయితే భవనంలోకి వైకుంఠధామం ఆర్చి నుంచి వెళ్లాల్సి వస్తుంది. మరోమార్గం లేకపోవడంతో ఎమ్మార్సీ ఉద్యోగులు ఆర్చి గుండా రాకపోకలు సాగిస్తున్నారు.
లోపించిన ప్రణాళిక, సమన్వయం
ఆర్చి బోర్డు మార్చి మార్చి వైకుంఠధామానికి వేరే మార్గంలో ఆర్చి ఏర్పాటు చేయాలని ఉద్యోగులు పలుమార్లు అధికారులను కోరినా ఫలితం లేకపోయిందని వాపోతున్నారు. ప్రణాళిక లేకపోవడం, శాఖల మధ్య సమన్వయ లోపం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఎమ్మార్సీ భవనానికి ఎదురుగా ఉన్న వైకుంఠధామం ఆర్చి ఉండటం, అక్కడి నుంచి రాకపోకలు సాగించాలంటే ఉద్యోగులు సెంటిమెంట్‌గా భావించి ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్ని ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. ఎమ్మార్సీకి, వైకుంఠధామానికి వేర్వేరు మార్గాలు ఏర్పాటు చేయాలని కోరుతాం.
–తల్లాడ శ్రీనివాస్, ఎంఈఓ, అనంతగిరి
ఉపాధ్యాయుల శిక్షణ, విద్యకు సంబంధించిన విధి విధానాలు, కార్యక్రమాల నిర్వహణ, పర్యవేక్షణ తదితర వాటి అమలుకు ఎమ్మార్సీ మండల స్థాయిలో కేంద్రంగా ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ పదుల సంఖ్యలో ఉద్యోగులు విధులు నిర్వహించడంతో పాటు నిరంతరం అధికారులు, ఉపాధ్యాయులు వచ్చిపోతుంటారు. అలాంటి ప్రాధాన్యత కలిగిన కార్యాలయానికి ఆర్చి గుండా వెళ్లాల్సి రావడంతో ఉద్యోగులు సంకుచితభావనకు లోనవుతున్నారు.
ఫ గందరగోళానికి గురవుతున్న ప్రజలు
ఫ వేర్వేరు మార్గాలు ఏర్పాటు చేయాలని వేడుకోలు
ఎమ్మార్సీ భవనమా.. వైకుంఠధామమా?


