పోలింగ్ నిర్వహణ బాధ్యత పీఓలదే
భానుపురి (సూర్యాపేట) : పోలింగ్ సజావుగా నిర్వహించే బాధ్యత ప్రిసైడింగ్ అధికారులేదనని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ సూచించారు. మున్సిపల్ ఎన్నికల ప్రిసైడింగ్ అధికారులకు గురువారం కలెక్టరేట్‌లో శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ హాజరై పీఓలకు సూచనలు చేశారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో మెటీరియల్ తీసుకున్నప్పటి నుంచి పోలింగ్ పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలన్నారు. పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేందుకు ఓడీ సౌకర్యం కల్పిస్తామని కలెక్టర్ వెల్లడించారు.
రాజకీయ పార్టీలు సహకరించాలి
ఎన్నికలను స్వేచ్ఛగా, శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని రాజకీయ పక్షాలు సహకరించాలని కలెక్టర్ కోరారు. తన చాంబర్‌లో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. కోడ్ ముగిసే వరకు ఎన్నికల నియమావళిని తప్పనిసరిగా పాటించాలన్నారు. పోస్టల్ బ్యాలెట్ తేదీలను త్వరలో ప్రకటిస్తామని, సూర్యాపేటలోని ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాలలో ఓట్ల లెక్కింపు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సీతారామరావు, నాయకులు చకిలం రాజేశ్వర్‌రావు, హబీద్, స్టాలిన్, గోపి, రమేష్, కరుణాకర్‌రెడ్డి, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ సంతోష్ కిరణ్, తదితరులు పాల్గొన్నారు.
మీడియా ప్రతినిధులతో సమావేశం
మీడియా ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం అయ్యారు. ఎన్నికల నిర్వహణకు తీసుకుంటున్న చర్యలను వారికి వివరించారు. జిల్లాలోని హుజూర్‌నగర్, కోదాడ, నేరేడుచర్ల, సూర్యపేట, తిరుమలగిరి మున్సిపాలిటీల్లోని 141 వార్డుల్లో 372 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, 2,26,586 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారని తెలిపారు.
ఫ కలెక్టర్ తేజస్ నంద్‌లాల్‌పవార్


