జోనల్ అధికారుల పాత్ర కీలకం
ఫ కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్
భానుపురి (సూర్యాపేట) : మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో జోనల్ అధికారుల పాత్ర కీలకమని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జోనల్ అధికారులు, ఎఫ్‌ఎస్‌టిటీ, ఎస్‌ఎస్‌టీ, వీఎస్‌టీ, వ్యయ పరిశీలకులకు ఎన్నికల నిర్వహణపై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి జోన్ పరిధిలో ఎన్నికల ఏర్పాట్లను జోనల్ అధికారులు నేరుగా పర్యవేక్షించాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల స్థితిగతులు, సిబ్బంది నియామకం, ఓటర్లకు మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాల్లో ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఎన్నికల నియమావళిని ఖచ్చితంగా అమలు చేయాలని, ఎలాంటి ఉల్లంఘనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
లావాదేవీలపై నిఘా ఉంచండి
ఎన్నికల సమయంలో అభ్యర్థులు ఖర్చు పరిమితిని తప్పనిసరిగా పాటించేలా పర్యవేక్షించడం వ్యయ పరిశీలకుల ప్రధాన బాధ్యత అని తెలిపారు. డబ్బు, బహుమతులు, మద్యం వంటి వాటి అక్రమ పంపిణీని అరికట్టేందుకు ఫ్లయింగ్ స్క్వాడ్, స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలతను సమన్వయం చేసుకుని చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అనుమానాస్పద లావాదేవీలపై నిఘా ఉంచాలని, నగదు, మద్యం, బహుమతులు, ఇతర ప్రలోభక వస్తువుల అక్రమ రవాణాను అడ్డుకోవాలన్నారు. చెక్‌పోస్టుల వద్ద నిరంతర తనిఖీలు నిర్వహించాలని, ఎఫ్‌ఎస్‌టీ బృందాలు క్షేత్రస్థాయిలో చురుగ్గా తిరుగుతూ ఫిర్యాదులపై తక్షణమే నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్ సీతారామారావు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని, పెళ్లిళ్లకు సంబంధించి, ఆస్పత్రికి వెళ్లే వారి విషయంలో ఉదాసీనతతో వ్యవహరించాలని తెలిపారు.
నీటి సమస్య తలెత్తరాదు
భానుపురి (సూర్యాపేట) : గ్రామాల్లో ప్రజలకు నిరంతరం సురక్షిత తాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రత్యేక నీటి సరఫరా డ్రైవ్ చేపట్టాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూ ఎస్, మిషన్ భగీరథ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వేసవిని దృష్టిలో పెట్టుకొని ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఫిబ్రవరి 1 నుంచి 20 వరకు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని పేర్కొన్నారు. గ్రామాల వారీగా బోర్లు, చేతిపంపులు, ఓవర్‌హెడ్ ట్యాంకులు, పైప్‌లైన్లు పూర్తిస్థాయిలో తనిఖీ చేయాలని ఆదేశించారు. పనిచేయని మోటార్లు, లీకేజీలు, బ్రేక్‌డౌన్లను వెంటనే గుర్తించి తక్షణమే మరమ్మతులు చేయాలని స్పష్టం చేశారు. నీళ్ల ట్యాంకులను శుభ్రపరచి తప్పనిసరిగా క్లోరినేషన్ చేయాలన్నారు. అంగన్‌వాడీ భవనాలను నిర్మించేందుకు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ ద్వారా నిధులు రాని వివరాలు సమర్పించాలని, వన మహోత్సవం 2025–26లో భాగంగా లక్ష్యం చేరుకోని శాఖలు ప్లాంటేషన్ చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సీతారామారావు, జెడ్పీ సీఈఓ శిరీష, మిషన్ భగీరథ ఈఈ అరుణాకర్‌రెడ్డి, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారి శ్రీనివాసరెడ్డి, ఎంపీడీఓలు, డీఈలు, ఏఈలు, ఎంపీఓలు పాల్గొన్నారు.


