పంట నిల్వకు.. ఉండదిక చింత
భానుపురి (సూర్యాపేట) : ‘సూర్యాపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ రైతు రెండు ఎకరాల్లో పండించిన కందులను మార్కెట్‌కు తీసుకెళ్లాడు. తీరా అక్కడికెళ్లాక నామమాత్రపు ధరనే పలికింది. పంటను నిల్వ చేసేందుకు ఇంటి దగ్గర స్థలం లేకపోవడంతో అరకొర ధరకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది’. జిల్లాలో చాలా మంది రైతులదీ ఇదే వ్యథ. ఇటువంటి సమస్య తలెత్తకుండా పంట ఉత్పత్తుల నిల్వకు ప్రతి గ్రామంలో గోదాములు నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీబీ జీరాంజీ (ఉపాధిహామీ) పథకం నిధులతో వీటిని నిర్మించనున్నారు. పైగా వీటిని అద్దెకు ఇవ్వడం వల్ల గ్రామ పంచాయతీలకు ఆదాయం పెరగనుంది. గోదాముల నిర్మాణ బాధ్యతలకు సంబంధించి మహిళా సమాఖ్యలకు తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
ఒక్కో గోదాముకు రూ.30 లక్షలు
సూర్యాపేట జిల్లాలో 486 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఒక్కో గోదాము నిర్మాణానికి రూ.30 లక్షల చొప్పున జిల్లా మొత్తానికి రూ.14.58 కోట్లు కేటాయించారు. గోదాము నిర్మించాలంటే వంద టన్నుల పంట ఉత్పత్తులను నిల్వ చేసే సామర్థ్యం ఉండేలా గ్రామంలో 444 చదరపు గజాల స్థలం ఉండాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం స్థలాల గుర్తింపు కొనసాగతోంది. రెండు, మూడు నెలల్లో స్థలాను గుర్తించి గ్రామ సభల్లో తీర్మానాలు చేయనున్నారు. మొత్తం నిధుల్లో 40 శాతం నిర్మాణ సామగ్రి, 60 శాతం కూలీల వేతనం కింద పనులు పూర్తి చేయాల్సి ఉంది.
ధర వచ్చినప్పుడే అమ్ముకునేలా..
ఆరుగాలం శ్రమించి పండించిన పంట దిగుబడులను అయినకాడికి అమ్ముకునే దుస్థితి నెలకొంది. గిట్టుబాటు ధర వచ్చే వరకు పంట ఉత్పత్తులను నిల్వ చేసుకునే సౌకర్యం లేక రైతన్న నష్టపోవాల్సి వస్తోంది. ముఖ్యంగా ఎక్కువ మొత్తం పంట ఉత్పత్తులు పండించిన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. గ్రామ పంచాయతీల్లో గోదాములు నిర్మించడం వల్ల రైతులకు ఆ కష్టాలు తొలగనున్నాయి. గోదాములను అద్దెకు తీసుకొని పంటను నిల్వ చేసుకునే వీలుంటుంది. ధర వచ్చినప్పుడే అమ్ముకో వచ్చు. సీజన్ లేని సమయంలో ఇతరులకు అద్దెకు ఇవ్వడంతో గ్రామ పంచాయతీలకు సైతం ఆదా యం పెరగనుందని అధికారులు అంటున్నారు.
గ్రామాల్లో వ్యవసాయ గోదాముల నిర్మాణం
ఫ జిల్లాకు రూ.14.58 కోట్లు మంజూరు
ఫ స్థలాలు గుర్తిస్తున్న అధికారులు


