మోగిన పట్టణ నగారా..
మున్సిపాలిటీల వారీగా ఓటర్లు
సూర్యాపేట : మున్సిపల్ ఎన్నికలకు నగారా మోగింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం మంగళవారం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. దీని ప్రకారం వచ్చేనెల 11న ఎన్నికలు మున్సిపాలిటీ ఎన్నికలు జరగనున్నాయి. జిల్లాలో సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్, తిరుమలగిరి, నేరేడుచర్ల మున్సిపాలిటీలు ఉన్నాయి. బుధవారం రిటర్నింగ్ అధికారులు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయనుండగా అదే రోజు నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. 13న ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడించనున్నారు. ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం ఇప్పటికే పూర్తి చేసింది. దాంతో మున్సిపాలిటీల్లో రాజకీయం వేడెక్కింది.
అధికార యంత్రాంగం సిద్ధం
సూర్యాపేట జిల్లాలో ఐదు మున్సిపాలిటీల్లో 141 వార్డులు ఉన్నాయి. వాటిలో ఎన్నికల నిర్వహణకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం పూర్తి చేసింది. ఓటర్ల తుది జాబితా ప్రకటించిన అధికారులు 372 పోలింగ్ కేంద్రాలను సైతం గుర్తించారు. వార్డుల వారీగా రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేశారు. ఎన్నికల నిర్వహణకు కావాల్సిన సామగ్రిని ఆయా మున్సిపల్ కేంద్రాలకు చేర్చారు. ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలో నిర్వహిస్తుండగా అందుకు 817 బ్యాలెట్ బాక్స్‌లు అవసరమున్నట్లు అధికారులు గుర్తించారు. వాటికి అదనంగా మరో 372 బాక్స్‌లను సమకూర్చారు. ఎన్నికల నిర్వహణకు 1,116 మంది సిబ్బంది కావాల్సి ఉండగా ఇప్పటికే 180 మంది ఆర్వో, ఏఆర్వో, ఇతర సిబ్బందికి శిక్షణ సైతం పూర్తి చేశారు. పోలింగ్ సిబ్బందికి త్వరలో శిక్షణ ఇవ్వనున్నారు.
మూడు వార్డులకు ఒక అధికారి
జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో బుధవారం ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయనుండగా అదేరోజు నుంచి ఈ నెల 30 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. రెండు, మూడు వార్డులకు కలిపి ఒకేచోట రిటర్నింగ్ అధికారులు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ నెల 31న నామినేషన్ల పరిశీలన, ఫిబ్రవరి 1న నామినేషన్లపై ఫిర్యాదు, 2న అప్పీలు పరిష్కారం, 3న మధ్యాహ్నం 3గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. అనంతరం పోటీ చేసే వారి జాబితాను ప్రకటిస్తారు. ఫిబ్రవరి 11న పోలింగ్, 13న ఓట్ల లెక్కింపు చేపడతారు.
2,26,646 మంది ఓటర్లు
ఎన్నికలు జరగనున్న ఐదు మున్సిపాలిటీల్లో 2,26,646 మంది ఓటర్లు ఉన్నారు. ఈ మేరకు ఇటీవల ఎన్నికల సంఘం తుది ఓటరు జాబితాను ప్రకటించింది. ఇందులో 1,08,763 మంది పురుషులు, 1,17,848 మంది మహిళలు, 35 మంది ఇతరులు ఉన్నారు. అత్యధికంగా సూర్యాపేట మున్సిపాలిటీలో 1,08,848 మంది ఉండగా, అత్యల్పంగా నేరేడుచర్లలో 13,746 మంది ఓటర్లు నమోదయ్యారు. కోదాడలో 58,601 మంది, హుజూర్‌నగర్‌లో 29,996 మంది, తిరుమలగిరిలో 15,455 మంది ఓటర్లు ఉన్నారు.
వేడెక్కిన రాజకీయం
మున్సిపల్ పోరుకు షెడ్యూల్ వెలువడడంతో అన్ని మున్సిపాలిటీల్లో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఇప్పటికే ఆశావహులు టికెట్ల కోసం ఆయా పార్టీల నాయకుల వద్ద క్యూ కట్టారు. రిజర్వేషన్లు తేలిన నాటి నుంచే తమకు అవకాశం కల్పించాలని ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు ముందస్తుగానే ప్రచారం ప్రారంభించారు. ప్రధాన పార్టీలు సైతం గెలుపు గుర్రాలను ఎంపిక చేసే పనిలో నిమగ్నమయ్యాయి. నేటినుంచే నామినేషన్ల స్వీకరణ మొదలు కానుండగా వార్డుల్లో అభ్యర్థుల ఎంపిక కొలిక్కి వచ్చే అవకాశాలున్నాయి.
జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలకు ఎన్నికలు
ఫ షెడ్యూల్ విడుదల, నేడు నోటిఫికేషన్
ఫ వెంటనే నామినేషన్ల స్వీకరణ
ఫ ఫిబ్రవరి 11న పోలింగ్,
13న ఫలితాల వెల్లడి
ఫ ఏర్పాట్లు చేస్తున్న అధికారులు
మున్సిపాలిటీ పురుషులు మహిళలు ఇతరులు మొత్తం
సూర్యాపేట 52170 56664 14 108848
కోదాడ 28069 30520 12 58601
హుజూర్‌నగర్ 14257 15731 08 29996
నేరేడుచర్ల 6629 7116 01 13746
తిరుమలగిరి 7638 7817 00 15455
మొత్తం 1,08,763 1,17,848 35 2,26,646
మోగిన పట్టణ నగారా..


