మట్టపల్లిలో నిత్యారాధనలు
మఠంపల్లి: మట్టపల్లి క్షేత్రంలో ఆదివారం ప్రత్యేక పూజలు, అభిషేకాలు వంటి నిత్యారాధనలు విశేషంగా కొనసాగాయి. ఈ సందర్భంగా శ్రీరాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని నూతన పట్టు వస్త్రాలతో వధూవరులుగా అలంకరించి ఎదుర్కోలు మహోత్సవం చేపట్టారు. అనంతరం కల్యాణతంతు పూర్తిచేసి శ్రీస్వామి అమ్మవార్లను గరుడ వాహనంపై ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, ఈఓ నవీన్‌కుమార్, అర్చకులు శ్రీనివాసాచార్యులు, పద్మనాభా చార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు, వంశీకృష్ణమాచార్యులు, భక్తులు పాల్గొన్నారు.
‘పేట’లో భద్రతా తనిఖీలు
సూర్యాపేట టౌన్: స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా జిల్లా ఎస్పీ సన్‌ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలో ఆదివారం సెక్యూరిటీ సిబ్బంది భద్రతా తనిఖీలు చేపట్టారు. పోలీస్ డాగ్‌తో హైటెక్ బస్టాండ్, కొత్త బస్టాండ్, ఫ్లై ఓవర్, పాత బస్టాండ్, పరేడ్ గ్రౌండ్‌కు వచ్చే రోడ్డు మార్గాలను, పాత భవనాలు, రద్దీ ప్రదేశాలను తనిఖీ చేశారు. వేడుకలకు హాజరవుతున్న ముఖ్య అతిథులు, విద్యార్థులు, పౌరులు, ప్రజాప్రతినిధులు, అధికారుల రక్షణలో భాగంగా తనిఖీలు నిర్వహించినట్లు భద్రత సిబ్బంది పేర్కొన్నారు.
మాదిగల సంస్మరణ సభను
విజయవంతం చేయాలి
పెన్‌పహాడ్: ఎమ్మార్పీఎస్ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ ఆధ్వర్యంలో ఈ నెల 13న హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించే మాదిగల సంస్మరణ సభను విజయవంతం చేయాలని ఆ సంఘం రాష్ట్ర కోర్ కమిటీ సభ్యుడు పల్లేటి లక్ష్మణ్ మాదిగ పిలుపునిచ్చారు. ఆదివారం పెన్‌పహాడ్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో ఆ సంఘం జిల్లా నాయకులు లక్కపాక రవీంద్రనాథ్ ఠాగూర్, లక్కపాక పిచ్చయ్య, శ్రీకాంత్, రాములు, నవీన్, నాగయ్య, వెంకన్న, జంపయ్య, హనుమయ్య తదితరులు పాల్గొన్నారు.
మట్టపల్లిలో నిత్యారాధనలు


