2019–24లో వైఎస్సార్‌సీపీ హయాంలో... | - | Sakshi
Sakshi News home page

2019–24లో వైఎస్సార్‌సీపీ హయాంలో...

Nov 5 2026 1:52 AM | Updated on Nov 5 2026 1:52 AM

పంటల కొనుగోలులో అక్రమాలు

గత ఖరీఫ్‌లో పంటల కొనుగోలులో అక్రమాలు ఏ స్థాయిలో చోటు చేసుకున్నాయో అందరికీ తెలిసిందే. క్షేత్రస్థాయిలో రైతుల వద్ద ధాన్యం అలాగే ఉన్నాయి. రికార్డుల్లో మాత్రం కొనుగోలు చేసినట్టు లెక్కలు చూపించారు. రూ.వందల కోట్ల కొనుగోలు సొమ్ము చేతులు మారిపోయింది. చివరికి దళారులకు రైతులు విక్రయించుకోవాల్సి వచ్చింది. దీనితో పాటు జిల్లాకు తొలుత వచ్చిన యూరియాలో 50 శాతం ప్రభుత్వ సంస్థలకు ఇవ్వగా, మిగతా 50 శాతం ప్రైవేటు వ్యాపారులకు ఇచ్చారు. తర్వాత జిల్లాకొచ్చిన యూరియాలో ప్రభుత్వ సంస్థలకు 70 శాతం, ప్రైవేటు వ్యాపారులకు 30 శాతం కేటాయింపులు చేశారు. అయితే ప్రభుత్వ సంస్థలకు కేటాయించిన చాలీచాలని యూరియాపై రాజకీయ నాయకుల పెత్తనం ఎక్కువ కావడంతో అది కూడా పక్కదారి పట్టి ప్రైవేటు వ్యక్తుల చేతిలోకి వెళ్లి, బ్లాక్‌ మార్కెట్‌లో విక్రయించిన పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఫలితంగా రైతులు అధిక ధరలకు కొనుగోలు చేసుకోవాల్సి వచ్చింది.

అందని నష్ట పరిహారం

అల్పపీడనం, తుఫాన్‌ల దాటికి జిల్లాలో పెద్ద ఎత్తున పంటలకు ముప్పు వాటిల్లింది. మోంథా తుఫాన్‌తో మరింత నష్టం జరిగింది. కానీ ప్రభుత్వం 33 శాతం కన్నా తక్కువ నష్టం ఉందని చాలా నష్టాన్ని జాబితాలో నుంచి తీసేసింది. ఇక పత్తి, మొక్కజొన్న, ఉద్యానవన పంటల నష్టాలకై తే అతీగతి లేదు. ఏమాత్రం నష్టం జరగలేదని తేల్చేసింది. మరోవైపు నష్ట నమోదు చేసిన పొలాలకు సైతం ఎకరాకు రూ.25 వేలకు పైగా పెట్టుబడి పెడితే.. ప్రభుత్వం 2.5 ఎకరాలకు రూ.25 వేలు ఇస్తామని ప్రకటించడం రైతులను మరింత కుంగదీసింది. అదైనా ఇచ్చిందా అంటే ఇంతవరకు ఏమీ లేదు. అలాగే ప్రతి రైతుకు ఏడాదికి రూ.20 వేలు అన్నదాత సుఖీభవ కింద ఇస్తామని చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం కొందరికే ఇచ్చింది. 3.22 లక్షల మందికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రైతు భరోసా ఇస్తే.. చంద్రబాబు ప్రభుత్వం 2.79 లక్షల మందికి ఇచ్చి చేతులు దులుపుకుంది. దీంతో దాదాపు 43 వేల మందికి మొండిచేయి చూపింది. ఇక ఉచిత పంటల బీమా, సున్నావడ్డీ, ఇన్‌పుట్‌ సబ్సిడీ పథకాలను గాలికొదిలేసింది. కనీసం ఈ–క్రాప్‌ కూడా సరిగా చేయలేని అసమర్థ ప్రభుత్వంగా మిగిలిపోయింది.

వైఎస్సార్‌సీపీ హయాంలో రైతులకు స్వర్ణయుగం

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్న 2019–24లో రైతులకు స్వర్ణయుగమే అని చెప్పాలి. అప్పట్లో ప్రతీది రైతు ఇంటి వద్దకే వచ్చేది. విత్తనాలు, ఎరువుల సరఫరా దగ్గర నుంచి ధాన్యం కొనుగోళ్లు వరకు రైతుల వద్దకే జరిగేది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రైతు ఎంత సాగు చేస్తున్నారో.. వారికెంత ఎరువులు అవసరమో ఈ–క్రాప్‌ ద్వారా ముందే గుర్తించేవారు. విలేజ్‌ అగ్రికల్చర్‌ అసిస్టెంట్లు ఇంటింటికీ వెళ్లి సర్వే చేసి వివరాలు తీసుకునేవారు. ఆ మేరకు రైతులకు సరిపడా ఎరువులు నేరుగా ఇంటికే రైతు భరోసా కేంద్రాల ద్వారా పంపిణీ చేసేవారు. ఎరువుల కోసం ఎవరినీ అడగాల్సిన అవసరం ఉండేది కాదు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం జిల్లాలో రైతుల కోసం 642 రైతుభరోసా కేంద్రాలు నిర్మించింది. 7 ఇంటిగ్రేటెడ్‌ ల్యాబ్‌లు నిర్మించారు. వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా కింద 87,158 మంది రైతులకు రూ.85.14 కోట్లు అందజేశారు. రూ.424.74 కోట్లతో 2,89,197 క్వింటాళ్ల విత్తనాలను సబ్సిడీ ధరపై అందించింది. 82,745 మెట్రిక్‌ టన్నుల ఎరువులు, పురుగు మందులు.. 5,592 లీటర్ల నానో యూరియా వంటివి ఆర్‌బీకేల ద్వారా అందించింది. రైతుల సాగుకు ఉపయోగపడేవిధంగా వైఎస్సార్‌ యంత్రసేవా పథకం కింద 505 ట్రాక్టర్స్‌, మల్టిపుల్‌క్రాప్‌ ట్రెసర్స్‌, పాడిరేపర్స్‌, రోటావెటర్స్‌, 57 క్లస్టర్లలో వరి కంబైన్డ్‌ హార్వెస్టర్స్‌ వంటివి అందించడం జరిగింది. 10 వేల భూసార పరీక్షలు చేసి.. 27,049 కౌలు రైతులకు గుర్తింపు కార్డులు అందజేసింది. ధాన్యం కొనుగోళ్లు సకాలంలో చేసింది. అక్రమాలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకుంది. ప్రకృతి వైపరీత్యాలకు పంట నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ కింద, వైఎస్సార్‌ సున్నా వడ్డీ కింద సాయం చేసింది. పశువుల వైద్యం కోసం వైఎస్సార్‌ సంచార అంబులెన్స్‌లను జిల్లాకు మంజూరు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement