యువకుడు ఆత్మహత్యాయత్నం | - | Sakshi
Sakshi News home page

యువకుడు ఆత్మహత్యాయత్నం

Nov 5 2026 1:52 AM | Updated on Nov 5 2026 1:52 AM

టెక్కలి రూరల్‌: స్థానిక ఎన్టీఆర్‌ పార్క్‌ ఆవరణలో బుధవారం యువకుడు గడ్డిమందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. తలగాం గ్రామానికి చెందిన బొమ్మాళి శ్రీను అనే వ్యక్తి బుధవారం మధ్యాహ్నం ఎన్టీఆర్‌ పార్కు సమీపంలో గడ్డిమందు తాగి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఇది గుర్తించిన స్థానికులు హుటాహూటిన టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. అయితే ఆత్మహత్యాయత్నానికి గల కారణం తెలియాల్సి ఉంది. ఇతనికి భార్య, పిల్లలు ఉన్నారు.

కూలిన ఇంటి గోడ

టెక్కలి రూరల్‌: గత కొద్ది రోజులుగా తుఫాన్లు కారణంగా కురిసిన వర్షాలతో మండలంలోని పాత నౌపడ గ్రామంలో ఒక ఇంటి గోడ కూలిపోయింది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. పాత నౌపడ గ్రామానికి చెందిన గాలి నీలకంఠేశ్వరరావు తన భార్య, పిల్లలతో కలిసి తనకు చెందిన మట్టిగోడలతో ఉన్న రేకుల షెడ్‌ ఇంట్లో నివాసముంటున్నారు. అయితే వర్షాలకు మట్టిగోడలు తడిచిపోవడంతో బుధవారం వేకువజామున ఇంటిగోడ ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.

ఏపీఎస్‌ ఆర్టీసీ ప్రత్యేక ఆధ్యాత్మిక యాత్రలు

● పంచారామాలు, శబరిమల

యాత్రలకు ప్రత్యేక బస్సులు

శ్రీకాకుళం అర్బన్‌: కార్తీక మాసం సందర్భంగా శివభక్తులు, అయ్యప్ప స్వామి భక్తుల సౌకర్యార్థం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ శ్రీకాకుళం జిల్లా ఆధ్వర్యంలో ప్రత్యేక ఆధ్యాత్మిక యాత్ర ప్యాకేజీలను ఏర్పాటు చేసినట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి సీహెచ్‌ అప్పలనారాయణ తెలిపారు. శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్‌ ఆవరణలో ప్రత్యేక యాత్రలకు సంబంధించిన ప్రచార కరపత్రాలను ఆర్టీసీ అధికారులు, సిబ్బంది బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా డీపీటీవో అప్పలనారాయణ మాట్లాడుతూ.. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని శివభక్తుల కోసం పంచారామ క్షేత్ర దర్శన యాత్రతో పాటు అయ్యప్ప స్వామి భక్తుల కోసం శబరిమల యాత్రకు ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం 5 రోజులు, 6, 7 రోజుల యాత్ర ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. ఈ ప్రత్యేక యాత్రల ద్వారా భక్తులు సురక్షితంగా, సౌకర్యవంతంగా పుణ్యక్షేత్రాలను దర్శించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం ఈ కరపత్రాలను ప్రయాణికులు, భక్తులకు ఆర్టీసీ అధికారులు, సిబ్బంది పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆర్టీసీ శ్రీకాకుళం–1, శ్రీకాకుళం–2 డిపోల మేనేజర్లు హనుమంతు అమరసింహుడు, కేఆర్‌ఎస్‌ శర్మ, ఆర్టీసీ ఎస్‌ఎం ఎంపీ రావు, ఎల్‌ఎస్‌ నాయుడు, ఆర్టీసీ అధికారులు ఏఎన్‌ఎస్‌ శ్రీనివాస్‌, ప్రసాద్‌, రాజు తదితరులు పాల్గొన్నారు.

అల్లాడ చెరువులో మొసలి?

జలుమూరు: అల్లాడ గ్రామ శివారు పెద్ద చెరువులో మొసలి తిరుగుతోందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బుధవారం వేకువజామున సుమారు 10 నుంచి 12 అడుగుల పొడవుతో చెరువు మధ్యలో ఉన్న శివుడి విగ్రహం చుట్టూ తిరిగిందని చెబుతున్నారు. కార్యదర్శి చిన్నారావు సమాచారం మేరకు టెక్కలి అటవీశాఖ అధికారులు, సెక్యూరిటీ బీట్‌ అధికారి ఎస్‌.కృష్ణారావు, అసిస్టెంట్‌ బీట్‌ అధికారి సీహెచ్‌ కృష్ణారావులు వచ్చి పరిశీలించారు. అరగంటకోసారి కళ్లు బయటకు కనిపిస్తున్నా మొసలి మాత్రం కాదని చెబుతున్నారు. పూర్తిగా సమాచారం తెలిసే వరకు ఎవరూ నీటిలో ఎవరూ దిగవద్దని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement