1,800 మందితో పటిష్ట బందోబస్తు | - | Sakshi
Sakshi News home page

1,800 మందితో పటిష్ట బందోబస్తు

Nov 5 2026 1:52 AM | Updated on Nov 5 2026 1:52 AM

● సమస్యాత్మక, అతి సమస్యాత్మక

ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా

● ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి

శ్రీకాకుళం క్రైమ్‌: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌ను ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛాయుతంగా, పారదర్శకంగా జరిపేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసిందని, దీనిలో భాగంగా 1800 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు నిర్వహించనున్నట్లు ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి బుధవారం తెలిపారు. వీరిలో ఇద్దరు అదనపు ఎస్పీలు, ఏడుగురు డీఎస్పీలు, 40 మంది సీఐలు, 65 మంది ఎస్‌ఐలు, ఏఎస్‌ఐలు, హెడ్‌ కానిస్టేబుళ్లు, పీసీలు, హోంగార్డులతో పాటు అనుబంధ విభాగాల పోలీసులున్నారన్నారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక కేంద్రాల్లో అదనపు బలగాలను మోహరించామని పేర్కొన్నారు. డ్రోన్‌ కెమెరాలు, సీసీ కెమెరాలు, వీడియోగ్రాఫర్లు, బాడీ వార్న్‌ కెమెరాల ద్వారా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని, దృశ్యాలన్నీ జిల్లా పోలీసు కంట్రోల్‌ రూమ్‌కు అనుసంధానమవుతాయన్నారు. క్షేత్రస్థాయిలో అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తూ తక్షణమే స్పందించేలా ప్రత్యేక బృందాలను సిద్ధంగా ఉంటాయన్నారు.

చెక్‌పోస్టుల వద్ద విస్తృత తనిఖీలు

అంతర్‌ జిల్లా, అంతర్రాష్ట్ర సరిహద్దులు, ప్రధాన రహదారులపై ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల వద్ద వాహన తనిఖీలను ముమ్మరం చేశారు. అక్రమ నగదు, మద్యం, ఇతర ప్రలోభపరిచే వస్తువుల రవాణాపై నిఘా పెట్టామని, లాడ్జీలు, హోటళ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ ఇతర ప్రాంతాల నుంచి వచ్చే అనుమానాస్పద వ్యక్తుల కదిలికలపై దృష్టి సారించామన్నారు. పోలీస్‌ యాక్ట్‌ 30, బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 163 (144 సెక్షన్‌) అమలు నేపథ్యంలో ప్రజలు గుంపులుగా ఉండరాదని హెచ్చరించారు. ఎన్నికలకు సంబంధించి సోషల్‌ మీడియాలో తప్పుడు వార్తలు, వదంతులు, విద్వేషపూరిత పోస్టులు ప్రచారం చేస్తే సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలుంటాయని స్పష్టం చేశారు. పోలింగ్‌ ముగిసిన అనంతరం బ్యాలెట్‌ బాక్సులు, ఎన్నికల సామగ్రి నిర్ధేశిత స్ట్రాంగ్‌ రూమ్‌లకు తరలించే సమయంలో ప్రత్యేక భద్రత ఉంటుందన్నారు.

జిల్లా పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌ 63099 90933, 112

జిల్లా పోలీస్‌ ఎన్నికల సెల్‌ 63099 90923

శ్రీకాకుళం డీఎస్పీ కార్యాలయం 63099 90804

కాశీబుగ్గ డీఎస్పీ కార్యాలయం 63099 90805

టెక్కలి డీఎస్పీ కార్యాలయం 63099 90811

కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు

గత ఎన్నికల్లో నేర చరిత్ర కలిగి, ప్రస్తుత ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అవకాశమున్న వ్యక్తులను గుర్తించి ఇప్పటికే బైండోవర్‌ చర్యలు చేపట్టామని ఎస్పీ తెలిపారు. ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలిగించినా, ఓటర్లను ప్రభావితం చేసినా తద్వారా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎవరైనా అనుమానాస్పద కార్యకలాపాలు చేసినా ఫిర్యాదు చేయాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement