● రైతులకు తప్పని విత్తనాలు,
ఎరువుల కష్టాలు
● సున్నావడ్డీ, ఉచిత పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీకి ఎగనామం
● అన్నదాత సుఖీభవలో కోత
● ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ రైతులకు కష్టాలు తప్పడం లేదు. అయితే అతివృష్టి లేదంటే అనావృష్టి సంభవిస్తోంది. దానికి తోడు మోసపూరిత విధానాలు వెరసీ రైతులకు నష్టాలే మిగులుతున్నాయి. గత చరిత్ర ఎలా ఉందో ఇప్పుడూ అలాగే ఉంది. విత్తనాలు దగ్గరి నుంచి ఎరువుల వరకు, పెట్టుబడి సాయం దగ్గరి నుంచి పంట నష్ట పరిహారం వరకు, సాగు చేసిన దగ్గరి నుంచి ధాన్యం కొనుగోలు చేసేవరకు రైతులకు సమస్యలు వెంటాడుతున్నాయి. అన్నదాత అంటేనే పచ్చ ప్రభుత్వానికి పడదేమో అన్నట్టుగా పరిస్థితి ఉంది. గతం పక్కనబెడితే 2024లో అధికారంలోకి వచ్చిన దగ్గరి నుంచి రైతులకు మోసాలు, ఇక్కట్లు తప్ప అంతకుమించి చేసిందేమి లేదు. రైతులకు మేలు చేసే విషయంలో వైఎస్ జగన్ ప్రభుత్వం చేసినదానికి, చంద్రబాబు ప్రభుత్వం చేసిన దానిని బేరీజు వేస్తే.. ప్రస్తుత ప్రభుత్వంలో అన్నదాతలు ఎంత ఇబ్బందులు పడుతున్నారో, ఎంత నష్టపోయారో అవగతమవుతుంది.


