అరసవల్లి: ప్రసిద్ధ అరసవల్లి సూర్యనారాయణ స్వామివారి ఆలయం ముందు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చీ రాగానే శాశ్వత భవనాలన్నీ కూల్చేసి ‘విజనరీ’ శాల అంటూ రూ.లక్షలాది నిధులతో నిర్మించిన ఒక కొబ్బరి ఆకుల శాల ఇప్పుడు వాలిపోయి కూలిపోయే స్థితికి చేరింది. సరిగ్గా ఏడాదిన్నర కాలం క్రితమే నిర్మించిన ఈ విజనరీ శాల ఇటీవల వర్షాలకు తడిసి ముద్దయ్యి, ప్రసాదాలు తినేందుకు భక్తులు లోపలకి వచ్చేందుకు కూడా భయాందోళనలకు గురిచేసింది. తాజాగా వరుస వర్షాల కారణంగా ఈ శాల మరింతగా వాలిపోయింది. ఏ క్షణాన కూలిపోతుందోననే భయంతో ఇక్కడి ప్రసాదాల విక్రయాల విభాగాన్ని వేరేచోటకు మార్చివేస్తూ ఆలయ ఈవో కేఎన్‌వీడీవీ ప్రసాద్ నిర్ణయించారు. అయితే దీన్ని మళ్లీ వినియోగంలోకి తెచ్చేందుకు దీపావళి, కార్తీక దీపారాధనలు అనంతరం కొబ్బరి ఆకులు, గ్రీన్ మ్యాట్‌లతో పునర్నిర్మాణం చేసేలా ఆలయ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతానికి శాల పైకప్పు అంతా తొలిగించే పనులను బుధవారం ఉదయం నుంచి మొదలుపెట్టారు. ఎంతైనా ఈ విజనరీ శాల పేరుతో కొందరు జేబులు నిండుతున్నాయనే గుసగుసలు స్థానికంగా చర్చనీయాంశమవుతున్నాయి.


