పుర పోలింగ్‌ నేడే | - | Sakshi
Sakshi News home page

పుర పోలింగ్‌ నేడే

Nov 1 2026 12:39 AM | Updated on Nov 1 2026 12:39 AM

పుర పోలింగ్‌ నేడే పలాసలో అలా..

ఇచ్ఛాపురంలో ఇలా..

కాశీబుగ్గ: పలాస–కాశీబుగ్గలో మున్సిపల్‌ పోరుకు సర్వం సిద్ధమైంది. ప్రత్యేక ఎన్నికల అధికారి శ్రావణ్‌కుమార్‌, ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాసులు నేతృత్వంలో శనివారం పలాస జూనియర్‌ కాలేజీ ఆవరణలో పోలింగ్‌ సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ఎన్నికల సామగ్రి అందించి సిబ్బందికి మార్గదర్శనం చేశారు. అలాగే పోలీస్‌ సిబ్బందికి పోలింగ్‌ కేంద్రాల వద్ద వ్యవహరించాల్సిన తీరుతెన్నులపై సీఐ మల్లా అప్పారావు సూచనలు,సలహాలు అందించారు.

●నియోజకవర్గంలో మహిళలే విజేతలను నిర్ణయించనున్నారు. పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు 1827మంది అధికంగా ఉన్నారు.

●మొత్తం 67 పోలింగ్‌ కేంద్రాలకు ఎనిమిది అత్యంత సమస్యాత్మక, 12 సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. అయితే అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా కేవలం ఈ 20 కేంద్రాలకే పరిమితం చేశారు.

●సాధారణ పోలింగ్‌ కేంద్రాల్లో మూడో నేత్రాన్ని ఏర్పాటు చేయలేదు. ఓ వైపు అధికార పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తున్న నేపథ్యంలో సీసీ కెమెరాలు లేనిచోట ఏవైనా అవకతవకలు చోటుచేసుకునే ప్రమాదం ఉందని బరిలో ఉన్న అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

●అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేశామని, సమస్యాత్మక కేంద్రాల్లో సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నామని, మిగతా సాధారణ కేంద్రాల్లో ఏర్పాటు చేయలేదని మున్సిపల్‌ కమిషనర్‌ శ్రావణ్‌కుమార్‌ తెలిపారు.

●చైర్‌ పర్సన్‌ అభ్యర్థులుగా తాళాసు శ్రీపద్మ(వైఎస్సార్‌సీపీ), వజ్జ గంగా భవానీ(టీడీపీ), కాంగ్రెస్‌ నుంచి బద్రి సీతమ్మ, స్వతంత్రులుగా దువ్వాడ శ్రీజ, మన్యాల రమ్య, లక్ష్మీ ప్రదాన్‌ పోటీ చేస్తున్నారు.

ఇచ్ఛాపురం: పుర పోరుకు ఇచ్ఛాపురం సన్నద్ధమైంది. ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లని సిద్ధం చేసినట్టు మున్సిపల్‌ కమిషనర్‌ ఎన్‌.రమేష్‌ తెలిపారు. శనివారం ఏపీ మోడల్‌స్కూల్‌, పురుషోత్తపురం డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌ నుంచి ఆదివారం మున్సిపాలిటిలో నిర్వహించే ఎన్నికల నిమిత్తం 39 పోలింగ్‌ కేంద్రాలలో పోలింగ్‌ నిర్వహణకు అవసరమైన సామగ్రిని ఎన్నికల నిర్వహణ సిబ్బందికి అందజేశారు.

మున్సిపాలిటీలో మహిళా ఓటర్లు పురుషుల కంటే 1577 మంది అధికంగా ఉన్నారు. వీరే ఈ ఎన్నికల్లో కీలకం కానున్నారు.

మున్సిపాలిటీ ఏఎస్‌పేట వద్ద గల 3వ నంబర్‌ గల పోలింగ్‌ కేంద్రం చుట్టూ ఇటీవల కురిసిన వర్షాలకు నీరు చేరి అపరిశుభ్రంగా ఉంది. ఈ పోలింగ్‌ కేంద్రానికి పురుషోత్తపురం చిన్న వీధి దక్షిణ భాగంలో కొంతమేరకు 3వ వార్డులో చేరడంతో అక్కడి ఓటర్లంతా వారి ఓటు హక్కుని వినియోగించుకునేందుకు సమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న 3వ నంబర్‌ గల పోలింగ్‌ కేంద్రానికి రావాల్సి ఉంటుంది

మున్సిపాలిటీ ఎన్నికల్లో చైర్‌పర్సన్‌గా నలుగురు అభ్యర్థులు పిలక రాజలక్ష్మి(వైఎస్సార్‌సీపీ), ఆశి లీలారాణి(టీడీపీ), బుడ్డెపు కీరమ్మ(కాంగ్రెస్‌), బచ్చ మంగమ్మ(ఇండిపెండెంట్‌) బరిలో ఉండగా వార్డు కౌన్సిలర్‌ అభ్యర్థులుగా 64 మంది పోటీల్లో ఉన్నారు.

మున్సిపాలిటీలో సమస్యాత్మకంగా గుర్తించిన 1, 2, 3, 4, 16, 17, 18 వార్డులకు సంబందించిన పోలింగ్‌ కేంద్రాల్లో 18 సీసీ కెమెరాలు ఏర్పాటుచేసినట్లు సిబ్బంది తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement