శ్రీకాకుళం పాతబస్టాండ్: ఓటు హక్కును ప్రతిఒక్కరూ బాధ్యతాయుతంగా వినియోగించుకోవాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేటా శుక్రవారం నిర్వహించిన ఉన్నత స్థాయి వీడియో కాన్ఫరెన్స్‌లో ఎన్నికల పరిశీలకులు మల్లారపు సూర్యతేజ, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్‌తో కలిసి పాల్గొన్నారు. ఎన్నికల నిర్వహణ, బందోబస్తు ఏర్పాట్లపై సమీక్షించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, నవంబర్ 1న ఇచ్చాపురం, పలాస మున్సిపాలిటీలలో ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని వెల్లడించారు. నవంబర్ 1న పలాస, ఇచ్ఛాపురం మున్సిపల్ పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలకు స్థానిక సెలవుగా ప్రకటించారు. పోలింగ్ కేంద్రాలుగా గుర్తించిన ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు అక్టోబర్ 31, నవంబర్ 1 సెలవు అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. కౌంటింగ్ కేంద్రాలుగా ఉన్న ప్రాంగణాలకు నవంబర్ 3న సెలవు వర్తిస్తుందని తెలిపారు. వాణిజ్య, వ్యాపార, పారిశ్రామిక సంస్థలు తమ ఉద్యోగులకు నవంబర్ 1న వేతనంతో కూడిన సెలవు మంజూరు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
1100 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు
శ్రీకాకుళం క్రైమ్: పలాస–కాశీబుగ్గ, ఇచ్చాపురం పురపాలక పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్‌ను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టిందని ఎస్పీ కె.వి.మహేశ్వర్ రెడ్డి శుక్రవారం తెలిపారు. సుమారు 1100 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నట్లు చెప్పారు. ఇందులో ఇద్దరు అదనపు ఎస్పీలు, ఐదుగురు డీఎస్పీలు, 20 మంది సీఐలు, 40 మంది ఎస్సైలు, ఏఎస్‌ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, పోలీసు కానిస్టేబుళ్లు, హోంగార్డులు ఉంటారని వివరించారు. పోలింగ్ కేంద్రాలు, సమస్యాత్మక ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా డ్రోన్ కెమెరాలు, సీసీ కెమెరాలు, వీడియో గ్రాఫర్లు, బాడీ వార్న్ కెమెరాల ద్వారా నిరంతర నిఘా ఏర్పాటు చేశామన్నారు. రూట్ మొబైల్స్, స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, క్యూఆర్‌టీ బృందాలు, రిజర్వ్ పార్టీలు, ఫ్లయింగ్ స్క్వాడ్లు, స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్‌లను అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. పోలింగ్ పూర్తయిన అనంతరం బ్యాలెట్ బాక్సులు/ఎన్నికల సామగ్రిని స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించే సమయంలో ప్రత్యేక భద్రత కల్పిస్తామన్నారు.
ఇన్‌చార్జి జీసీడీఓగా ఉమ
శ్రీకాకుళం: శ్రీకాకుళం ఇన్‌చార్జి జీసీడీఓగా ఉమను నియమిస్తూ సమగ్ర శిక్ష అధికారులు శుక్రవారం ఉత్తర్వులు వెలువరించారు. ఈమె అదే శాఖలో సహాయ ఐఈ కో–ఆర్డినేటర్‌గా పనిచేస్తున్నారు. ఇప్పటివరకు జీసీడీఓగా పనిచేసిన మాధవిని సహాయ కో–ఆర్డినేటర్‌గా నియమించారు.
రేపటి నుంచి రాష్ట్రస్థాయి సైన్సు సంబరాలు
శ్రీకాకుళం: భీమవరం నగరంలోని అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కేంద్రంలో నవంబర్ 1 నుంచి 3 వరకు చెకుముకి రాష్ట్ర స్థాయి సైన్సు సంబరాలు నిర్వహిస్తున్నట్లు జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి గొంటి గిరిధర్ శుక్రవారం తెలిపారు. శ్రీకాకుళం జిల్లా నుంచి సోంపేట ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థులు రత్నాల లిఖిత్, సుబుద్ధి హరిచరణ్, పదుము ఉషశ్రీ, టెక్కలి ఓక్లాండ్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొంటారని పేర్కొన్నారు.


