● పొందూరు రైల్వేస్టేషన్‌లో ఇద్దరు అరెస్టు
● ఒడిశా నుంచి కర్ణాటకకు తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు
జి.సిగడాం(పొందూరు): పొందూరు రైల్వేస్టేషన్‌లో శుక్రవారం అక్రమంగా తరలిస్తున్న 31.275 కిలోల గంజాయిని స్వాఽధీనం చేసుకుని కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఇద్దరిని అరెస్టు చేసినట్టు ఆమదాలవలస సీఐ సన్యాసినాయుడు, ఎస్‌ఐ రాజేష్ తెలిపారు. పట్టుబడిన వారిలో కర్ణాటకకు చెందిన జుబీర్ మునాఫ్‌సాబ్ హకీమ్, సునీల్ తల్వార్ ఉన్నారని చెప్పారు. వీరి వద్ద నుంచి రూ.లక్షా 95 వేలు విలువ చేసే గంజాయి, మూడు సెల్‌ఫోన్లు, స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. వీరిద్దరూ ఒడిశా రాష్ట్రం రాయగడ నుంచి అక్రమంగా తరలిస్తున్నట్లు తెలిపారు.
ఆటో డ్రైవర్ సమాచారంతో..
నిందితులు రెండు సూట్‌కేసులతో రైల్వేస్టేషన్‌లో ఆటో కోసం వేసిచూడటంతో ఆటో డ్రైవర్‌కు అనూమానం వచ్చింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో ఈ ముఠా గుట్టు రట్టు అయ్యింది. తహసీల్దార్ వెంకటేష్ సమక్షంలో గంజాయి విలువ లెక్కించారు. కాగా, పొందూరు రైల్వేస్టేషన్ గంజాయి రవాణాకు అడ్డాగా మారుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల మహారాష్ట్రకు చెందిన మహిళలు అక్రమంగా గంజాయి తరలిస్తూ ఇక్కడే పట్టుబడ్డారు. దీంతో సామాన్యులు ఇక్కడికి వచ్చి రైలు ప్రయాణం చేయాలంటేనే భయాందోళన చెందుతున్నారు.


