ఆర్టీసీలో అడ్డగోలు బాగోతం | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీలో అడ్డగోలు బాగోతం

Oct 28 2026 6:06 AM | Updated on Oct 28 2026 6:06 AM

విజయనగరం ఆర్టీసీలో వెలుగు చూసిన వ్యవహారం

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: విజయనగరం ఆర్టీసీ డీపీటీఓ (డిస్ట్రిక్ట్‌ పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టు ఆఫీసర్‌)లో అడ్డగోలు బాగోతం వెలుగు చూసింది. ఆర్టీసీ కార్మికులకు వైద్యసేవలు అందించే ప్రైవేటు ఆస్పత్రికి చెల్లించాల్సిన బకాయిలను వేరొకరి ఖాతాకు మళ్లించినట్టు సంచలన విషయాలు బయటకొచ్చాయి.

విజయనగరంలో ఉన్న డాక్టర్‌ సంజన మల్టీ స్పెషాలిటీ లేజర్‌ డెంటల్‌ క్లినిక్‌ను శ్రీకాకుళానికి చెందిన డాక్టర్‌ ఊడి సంతోష్‌ నడుపుతున్నారు. ఆర్టీసీ కార్మికులకు దంత పరమైన వైద్యసేవలందించేందుకు విజయనగరం ఆర్టీసీ అధికారులతో ఒక ఎంఓయూ చేసుకున్నారు. ఆర్టీసీ కార్మికులకు, వారి కుటుంబ సభ్యులకు అందించే వైద్య సేవలకు గాను టారిఫ్‌ మేరకు చెల్లింపులు చేసేందుకు ఒప్పందం చేసుకున్నారు. అయితే, ఈ వైద్య సేవలకు సంబంధించి ఆయా ఆస్పత్రికి చెల్లించాల్సిన బకాయిలను యాజమాన్యం ఖాతాలో కాకుండా వేరొక వ్యక్తి ఖాతాకు జమ చేశారు. బకాయిలు జమ చేయగానే ఎంఓయూ చేసుకున్న ఆస్పత్రి అసలు యజమానికి మెయిల్‌ వచ్చింది. దీంతో తన ఆస్పత్రి ఖాతాను చూసేసరికి నిధులు జమ కాలేదు. మెయిల్‌ వచ్చింది, నిధులు పడకపోవడమేంటని ఆర్టీసీ అధికారులను సంప్రదించారు. దీంతో ఆర్టీసీ అధికారులు అప్రమత్తమై, పరిశీలించేసరికి అది అసలు ఖాతా కాదని తేలింది. వెంటనే బ్యాంకును ఆర్టీసీ అధికారులు సంప్రదించే ప్రయత్నం చేశారు. ఆ సమయానికి సదరు ప్రైవేటు వ్యక్తులు తమ ఖాతాలో జమ అయిన సొమ్మును విత్‌ డ్రా చేసేశారు.

ఆరా తీయడంతో వెలుగులోకి..

శ్రీకాకుళానికి చెందిన కొందరు వ్యక్తులు, ఒక బ్యాంకు ఖాతాను పట్టుకుని విజయనగరం ఆర్టీసీ అధికారుల వద్దకు వెళ్లి, ఆస్పత్రి బ్యాంకు ఖాతా మారిందని, ఇకపై చెల్లింపులు తాము ఇచ్చిన ఖాతాకు జమ చేయాలని కోరడంతో ఆర్టీసీ అధికారులు తమ అకౌంట్స్‌లో ఖాతా నంబర్‌ మార్పు చేసేశారు. ఎలాంటి ముందస్తు వెరిఫికేషన్‌ లేకుండా, ఆస్పత్రి ఫౌండర్‌, డాక్టర్‌ వూడి సంతోష్‌ను సంప్రదించకుండానే ఖాతాను మార్పు చేయడం అనమానాలకు తావిస్తోంది. ఒకే దఫా రూ. 3,11,200 జమ చేసిన మెయిల్‌ ఆధారంగా అప్రమత్తమై, ఆర్టీసీ అధికారులను డాక్టర్‌ సంతోష్‌ సంప్రదించడంతో పాటు ఫిర్యాదు చేయడం వల్ల వ్యవహారం వెలుగు చూసింది. ప్రస్తుతానికి విజిలెన్స్‌ అధికారులు రంగంలోకి దిగారు. ప్రస్తుతం విచారణ చేస్తున్నారు. నిధులు జమ చేయాలని మరో ఖాతా నంబర్‌ ఇచ్చిన వ్యక్తులతో పాటు సంబంధిత ఉద్యోగులు బాధ్యత వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికీ ఆర్టీసీ ఉద్యోగులు తాము గుర్తించలేకపోయామని, ఆస్పత్రికి సంబంధించిన వ్యక్తులని చెప్పడంతో మార్పు చేసేశామని, ఇప్పుడు తమ పీక చుట్టుకుందని ఆందోళన చెందుతున్నారు. తమ ఉద్యోగానికి ఎసరొచ్చేలా ఉందని, ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలని డాక్టర్‌ వూడి సంతోష్‌ను ప్రాధేయ పడుతుండగా, నిధులు జమ చేసిన ఖాతాకు సంబంధించిన వ్యక్తులను కూడా సంప్రదించి, మీ ఖాతాలో వేసిన నిధులు వెనక్కి ఇచ్చేయండని కోరుతున్నారు. ఆస్పత్రి ఫౌండర్‌ సంతోష్‌ మాత్రం ఖాతాను మార్చడంలో ప్రమేయం ఉన్న వ్యక్తులపై కేసులు పెట్టాలని కోరుతున్నారు. ప్రస్తుతం విజయనగరం ఆర్టీసీకి చెందిన ఉద్యోగులు మంగళవారం శ్రీకాకుళం వచ్చి ఇరువర్గాలను బతిమలాడే పనిలో పడ్డారు.

కార్మికుల వైద్యసేవల కోసం సంజన

డెంటల్‌ ఆస్పత్రితో ఎంఓయూ

టారిఫ్‌ మేర చెల్లింపులు చేసేందుకు డాక్టర్‌ సంతోష్‌తో ఒప్పందం

తాజాగా వేరే ఖాతాకు బకాయిలు జమ

తప్పు గుర్తించి ఫిర్యాదు చేసిన ఆస్పత్రి నిర్వాహకుడు

రంగంలోకి విజిలెన్స్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement