సిక్కోలుపై అర్నబ్ తుఫాన్ ప్రభావం చూపుతోంది. జిల్లావ్యాప్తంగా మంగళవారం రోజంతా ఎడ తెరిపి లేకుండా వానలు కురిశాయి. ఉద్దానం ప్రాంతంలో పలు చోట్ల చెట్లు నేలకొరిగాయి. అక్కడే సముద్రం ముందుకు వచ్చి మత్స్యకారులను భయపెట్టింది. మరో రెండు రోజుల పాటు తుఫాన్ వానలు రానున్న నేపథ్యంలో నదులకు వరద ముప్పు పొంచి ఉంది. ఈ నేపథ్యంలో తీర, లోతట్టు ప్రాంతాల్లో అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు.
●జిల్లా వ్యాప్తంగా వర్షాలు ●అక్కడక్కడా ఈదురుగాలులు ●రైతు గుండెల్లో ‘అర్నబ్’ గుబులు
కొత్తూరు: జిల్లాలోని పత్తి రైతుల గుండెల్లో అర్నబ్ తుఫాన్ ఆందోళన రేకెత్తిస్తోంది. కొత్తూరు, ఎల్ఎన్పేట, పొందూరుతో పాటు పలు మండలాల్లో పత్తి పంట సాగు చేస్తున్నారు. మంగళవారం వర్షాలు కురవడంతో పత్తి, కాయలు, పిందెలు పాడైపోయే ప్రమాదం ఉంది. పంట అందే సమయంలో తుఫాన్ దెబ్బ తీసేలా ఉందని ఆందోళన చెందుతున్నారు.


