శ్రీకాకుళం క్రైమ్ : సమాజంలో అవినీతిని కూకటివేళ్లతో పెకిలించి వేసేందుకు ప్రజలంతా భాగస్వామ్యులు కావాలని, ప్రభుత్వ అధికారి లంచం తీసుకోవడం ఎంత నేరమో ప్రజలు లంచం ఇవ్వడమూ అంతే నేరమని జిల్లా అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) డీఎస్పీ సత్యనారాయణ స్పష్టం చేశారు. ఏసీబీ విజిలెన్సు వారోత్సవాల్లో భాగంగా ఈ నెల 26 నుంచి నవంబరు 1 వరకు సాగే అవగాహన కార్యక్రమాల్లో ‘లంచం వద్దు– నిజాయితీ ముద్దు’ వంటి నినాదాలతో ప్రజలను చైతన్యపరుస్తామన్నారు. ఈ మేరకు సోమవారం జిల్లాకేంద్రంలోని జీటిరోడ్డు మీదుగా ర్యాలీ నిర్వహించి బృందంతో కలిసి నినాదాలు చేశా రు. అంతకుముందు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ కార్యాలయానికి వెళ్లి ప్రచార పోస్టర్లను ఆవిష్కరించారు. అవినీతిపై ఫిర్యాదు చేసేందుకు శ్రీకాకుళం ఏసీబీ కార్యాలయం(08942–278754), ఏసీబీ డీఎస్పీ (94404 46124), ఇన్‌స్పెక్టర్లు(7382629272, 94913 05632), టోల్‌ఫ్రీ(1064), ఏసీబీ వాట్సాప్ (9440440057)లను సంప్రదించవచ్చని పేర్కొన్నారు.
అవినీతి రహిత సమాజమే లక్ష్యం
శ్రీకాకుళం క్రైమ్ : అవినీతి రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా కృషిచేయాలని శ్రీకాకుళం విజిలెన్సు అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి (ఆర్‌వీఅండ్‌ఈవో), ఏఎస్పీ సీహెచ్ వివేకానంద పిలుపునిచ్చారు. విజిలెన్సు అవేర్‌నెస్ వీక్–2026లో భాగంగా సోమవారం శ్రీకాకుళం రామలక్ష్మణ కూడలి సమీపంలో కార్యాలయంలో సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. అవినీతిని నిర్మూలిద్దాం.. లంచం ఏ ప్రభుత్వ అధికారి తీసుకున్నా తక్షణమే ఏసీబీకి ఫిర్యాదు చేద్దాం..అంటూ రూపొందించిన పోస్టర్లను జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డిని ఆవిష్కరించారు. కార్యక్రమంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సత్యనారాయణ, అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఎస్.ఎర్రన్నాయుడు పాల్గొన్నారు.
లంచం అడిగితే చెప్పండి: ఎస్పీ
శ్రీకాకుళం క్రైమ్ : ప్రభుత్వ కార్యాలయాల్లో సేవలను ఉచితంగా పొందడం ప్రజల హక్కు అని, ఎవరైనా ప్రభుత్వ అధికారి చేసే పనికి లంచం డిమాండ్ చేస్తే తక్షణమే అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కు ఫిర్యాదు చేయాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజలు చేయాల్సిందల్లా ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064 లేదా వాట్సాప్ నెంబర్ 94404 40057 నంబర్‌కు డయల్ చేసి గానీ, నేరుగా జిల్లాకేంద్రంలోని బలగ సమీపంలోని కార్యాలయాన్ని సంప్రదించి గానీ తమ సమస్యను తెలియజేయాలని ఎస్పీ సూచించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏసీబీ డీఎస్పీ సత్యనారాయణరావు, సీఐలు భాస్కర్, రమణమూర్తి, ఇతర సిబ్బందితో కలసి 1064 ప్రచార ఫ్లెక్సీ, పోస్టర్‌లను ఎస్పీ ఆవిష్కరించారు. అవినీతికి సంబంధించిన సమాచారాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని, ఫిర్యాదుదారు వివరాలు గోప్యంగా ఉంచేలా చర్యలు తీసుకుంటారని ఎస్పీ తెలిపారు.
వర్సిటీలో తరగతులు రద్దు
ఎచ్చెర్ల : అర్నబ్ తుపాన్ కారణంగా విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఎచ్చెర్లలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ యూనివర్సిటీలో ఈ నెల 27 నుంచి 31 వరకు తరగతులు రద్దు చేశారు. వీసీ రజనీ ఆదేశాల మేరకు రిజిస్ట్రార్ బి.అడ్డయ్య ఉత్తర్వులు జారీచేశారు. విద్యార్థులు, బోధనా సిబ్బంది ఇళ్లలోనే ఉండాలని సూచించారు. వసతి గృహాల విద్యార్థులు వార్డెన్‌ను సంప్రదిస్తూ వాతావారణ శాఖ జారీచేసిన సూచనలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు.


