కొందరు కొండెక్కి దిగడం లేదు | - | Sakshi
Sakshi News home page

కొందరు కొండెక్కి దిగడం లేదు

Oct 27 2026 12:56 AM | Updated on Oct 27 2026 12:56 AM

● మాట వినని వాడికి భవిష్యత్‌లో ఉంటుంది

● కేడర్‌తో ఫోన్‌ కాన్ఫరెన్స్‌లోఎమ్మెల్యే గొండు శంకర్‌ ఘాటు వ్యాఖ్యలు

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ‘కొంతమంది సెంటిమెంట్‌ను వండి పాకం తయారు చేస్తున్నారు. ఆ పాకాన్ని ఎలా తిప్పి కొట్టాలో చూసి, మాట్లాడుకుందాం. కన్ను మిన్ను కానకుండా ఎగిరినోడు.. తర్వాత వాడికి తెలుస్తాది. రాబోయే రోజుల్లో ఏమిటీ జీవితమని.. ఒక్కొక్కడు కొండెక్కి, చెట్టెక్కిపోయి దిగడం లేదు. ఇదే పెద్ద జీవితం లాగా.. మన మాట వినడం లేదు.’

శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌ తన పార్టీ నాయకులతో జరిపిన ఫోన్‌ కాన్ఫరెన్స్‌లో

అన్న మాటలివి. ఎమ్మెల్యే వ్యాఖ్యలు పార్టీలో చర్చనీయాంశంగా మారాయి.

శ్రీకాకుళం, రూరల్‌ మండలాల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో టీడీపీ నుంచి టికెట్‌ ఆశించి భంగపడ్డ కొందరు రెబెల్స్‌గా ఉన్నారు. మరికొందరు కేంద్రమంత్రి, ఎమ్మెల్యే ఒత్తిడితో వెనక్కి తగ్గినా అసంతృప్తిగా ఉన్నారు. పార్టీ కోసం పనిచేసే పరిస్థితి కనిపించడం లేదు. అదేవిధంగా జనసేన, బీజేపీ నాయకులు అసంతృప్తిగా ఉన్నారు.

● కల్లేపల్లి ఎంపీటీసీ కోసం సాధు సోదరులు ఆశించారు. కానీ ఎంపీటీసీ మూకల శ్రీనుకి, సర్పంచ్‌గా మూకల జయానంద్‌కు మొగ్గు చూపారు. దీంతో సాధు కామేశ్వరరావు రెబెల్‌గా పోటీ చేశారు. కామేశ్వరరావును డ్రాప్‌ చేయాలని కోరితే, ఆయన ససేమిరా అనడంతో సంగతి చూస్తామంటూ బెదిరిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.

● కనుగులవానిపేటలో టీడీపీ రెబల్‌గా ఒకామె బరిలో ఉన్నారు. ఆమె కూడా వెనక్కి తగ్గడం లేదు.

● సింగుపురం గ్రామంలో నాలుగు ఎంపీటీసీలు ఉండగా, కళింగ వైశ్యులు ఒకటి కోరారు. వారికి ఇవ్వనని చెప్పడంతో తమలో ఒకరు ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తామంటే.. వ్యాపారాలు ఎలా చేస్తారో చూస్తానని కూడా బెదిరించినట్టు ప్రచారం జరుగుతోంది.

● తండేంవలస, బెండిపేట ఎంపీటీసీ పరిధిలో ఒక గ్రామానికి చెందిన నాయకులు అసంతృప్తితో గుర్రుగా ఉన్నారు.

● పరిస్థితులు కాస్త వ్యతిరేకంగా ఉండటం, అసంతృప్తులు అలక పూనడం, రెబెల్స్‌ మాట వినకపోవడం వంటి పరిణామాలతో శ్రీకాకుళం నియోజకవర్గం టీడీపీ ఆందోళన చెందుతున్నట్టు ఉంది. అసలుకే ఎసరొచ్చేలా ఉందని భావిస్తూ కేడర్‌తో ఎమ్మెల్యే గొండు శంకర్‌ ఎప్పటికప్పుడు సమావేశమవుతున్నారు. ఇందులో భాగంగా తాజాగా నియోజకవర్గ పరిఽధిలోని 800 మంది నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన ఫోన్‌ కాన్ఫరెన్స్‌లో సీరియస్‌గా మాట్లాడారు. మాట వినని, చెట్టెక్కి కూర్చున్న వారిపై కఠినంగా స్పందించారు. భవిష్యత్‌లో వాళ్లకి తగిన బుద్ధి చెబుతామన్నట్టుగా హెచ్చరికలు జారీ చేశారు. ఎమ్మెల్యే తాజా వ్యాఖ్యలు, హెచ్చరికలు నియోజకవర్గ టీడీపీలో చర్చకు దారితీశాయి. ఎమ్మెల్యే మాట వినని వరకు పరిస్థితి వెళ్లిందంటే ఏదో తేడా ఉన్నట్టుగా ఉందని శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement